Panama Canal: పనామా కాలువపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Panama Canal: పనామా కాలువపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X
త్వరలో శక్తివంతమైన చర్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

పనామా కెనాల్‌పై చైనా ప్రభావం, నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ‘ఒక శక్తివంతమైన చర్య’ ఉంటుందని ఆదివారం ట్రంప్‌ ప్రకటించారు. పనామా కెనాల్‌పై చైనా ప్రభావం పెరుగుతున్నదని, అమెరికా, పనామా మధ్య కుదిరిన ఒప్పందాన్ని పనామా ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ ఆరోపించారు. పనామా కెనాల్‌ నిర్వహణను అమెరికా ప్రభుత్వం వాపసు చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు. పనామాకు అత్యంత కీలకమైన కెనాల్‌ను మూర్ఖంగా ఇచ్చివేశారని ఆయన అమెరికా గత పాలకులను విమర్శించారు. కెనాల్‌ను అమెరికాకు తిరిగి అప్పగించని పక్షంలో ‘శక్తివంతమైన చర్య’ జరుగుతుందని ట్రంప్‌ వెల్లడించారు. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాలను కలిపే కీలకమైన పనామా జలమార్గాన్ని చైనాకు ఇవ్వలేదని, అమెరికా, పనామా మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘన జరిగిందని ట్రంప్‌ అన్నారు.

ఏంటీ పనామా కాలువ వివాదం..?

వాణిజ్య నౌకల రాకపోకలకు పనామా కాలువ అత్యంత కీలకం. పనామాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుని ఈ కాలువను 1914 లో నిర్మించింది. 1999 లో కాలువను పనామాకు అప్పగించింది. ఆ తర్వాత కాలువపై చైనా జోక్యం పెరిగిపోయిందని అమెరికా ఆరోపణలు గుప్పించింది. తమ నౌకల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందంటూ పనామాపై విమర్శలు చేసింది. ఫీజులు తగ్గించకపోతే కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సందర్భాలలో హెచ్చరించింది.

తాజాగా ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తోందని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అందుకే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం అమెరికా దురాక్రమణకు భయపడబోమని, ఈ విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పనామా ప్రెసిడెంట్ జోస్‌రౌల్‌ ములినో తేల్చిచెప్పారు.

పనామా కెనాల్‌ను ఆధునిక ప్రపంచ వింతగా ఆయన అభివర్ణించారు. అమెరికా నిర్మించిన ఈ కెనాల్‌ 1914లో ప్రారంభమైందని, బార్బడాస్‌, జమైకాతోపాటు ఇతర కరీబియన్‌ దేశాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆఫ్రికన్‌ కార్మికుల స్వేదంతో నిర్మించిన ఈ కెనాల్‌ను 1999లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ పనామాకు అప్పగించారని ట్రంప్‌ చెప్పారు. పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలగాలు అవసరమని తాను భావించడం లేదని ట్రంప్‌ చెప్పారు. పనామా ప్రభుత్వం తప్పు చేసిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించిదని ట్రంప్‌ చెప్పారు. పనామా కెనాల్‌ను చైనా నిర్వహిస్తోందని, దాన్ని చైనాకు తాము ఇవ్వలేదని, పనామాకు మాత్రమే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

1977లో చేసుకున్న ఒప్పందం మేరకు పనామా కెనాల్‌పై నియంత్రణను పనామాకు 1999లో అమెరికా అప్పగించింది. అయితే జలమార్గం తటస్థంగా ఉండాలని ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది. అయితే కెనాల్‌ నిర్వహణ కార్యకలాపాలకు అంతర్గత ఘర్షణల వల్ల కానీ, విదేశీ శక్తుల వల్ల కాని ఆటంకం ఏర్పడిన పక్షంలో అమెరికా సైనికపరంగా జోక్యం చేసుకోవచ్చని ఒప్పందంలో ఉంది. అమెరికా నియంత్రణలో ఉన్న రోజుల కంటే ఇప్పుడు భారీ మొత్తంలో సరకు రవాణా ఈ కెనాల్‌ మీదుగా సాగుతున్నది.

Tags

Next Story