Donald Trump: ట్రంప్‌కు 3 వేల కోట్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ జడ్జి భారీ జరిమానా విధించారు. సుమారు 355 మిలియన్ల డాలర్లు అంటే దాదాపు 2900 కోట్ల పెనాల్టీ ఆయన చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ జడ్జి ఈ తీర్పును వెలువరిచారు. న్యూయార్క్ కార్పొరేషన్‌కు ఆఫీసర్‌గా కానీ డైరెక్టర్‌గా మూడేళ్ల పాటు ఉండకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తన ప్రాపర్టీల విషయంలో ట్రంప్ అబద్దాలు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల పాటు ట్రంప్ మళ్లీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోరాదు అని జడ్జి ఆర్డర్ ఎంగోరణ్ ఆదేశించారు. అయితే ఈ తీర్పు పట్ల అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.
తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ తన దగ్గరున్న ఆస్తుల మొత్తాన్ని వాస్తవ విలువ కంటే అత్యధికంగా చూపి.. బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్ల నుంచి ఆయన ఈ మోసపూరిత చర్యలకు పాల్పడుతూ.. భారీ మొత్తంలో వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ దావా వేశారు. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ట్రంప్‌పై వచ్చిన అభియోగాలు నిజమని రుజువైంది. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్‌కు $354.9 మిలియన్ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే.. ఇదొక సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
కాగా.. ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమంగా ఆయన స్పందిస్తూ.. జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ ఒక నిజాయితీ లేని వ్యక్తి అని, తనపై ఈ దావా వేసిన లెటిటియా జేమ్స్ సైతం అవినీతిపరురాలని ఆరోపణలు గుప్పించారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పూర్తిగా బోగస్ అని చెప్పిన ఆయన.. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని, తనపై బురద జల్లేందుకే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు.. తాను చేసిన మోసాలకు గాను ట్రంప్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని జేమ్స్ బదులిచ్చారు. ఎంత పెద్ద ధనవంతులు లేదా శక్తివంతులైనా.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com