Trump:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్’’ విక్టరీ ర్యాలీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. టిక్ టాక్ నుంచి ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించడం వరకు పలు కీలక అంశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ర్యాలీకి చాలా మంది స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామని ట్రంప్ చెప్పారు. మన దేశ సంపదను ఇకనుంచి మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలువరిస్తా. రష్యా – యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ అన్నారు.
గత నాలుగేళ్లుగా మన దేశం అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. రేపటి నుంచి దేశం ఎదుర్కొంటున్న ప్రతిఒక్క సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి క్రెడిట్ తీసుకున్న ట్రంప్.. ఈ ఒప్పందం మధ్య ప్రాశ్చంలో శాశ్వత శాంతికి మొదటి అడుగు అని.. ఇది గతేడాది నవంబర్ ఎన్నికల్లో తన విజయం ఫలితంగా మాత్రమే జరిగిందని ట్రంప్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
టిక్‌టాక్ యాప్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘టిక్‌టాక్ యాప్ ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్ టాక్ యాప్ లో అమెరికా ప్రభుత్వం 50శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది’’ అని ట్రంప్ అన్నారు.
ఇదిలాఉంటే.. అమెరికాలో టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌ను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్తచట్టం అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందే దీని సేవలు నిలిచిపోయాయి. అయితే, ట్రంప్ హామీతో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే మళ్లీ టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్ తన సేవలను పునరుద్దరించింది. ‘‘మా సర్వీస్ ప్రొవైడర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. టిక్‌టాక్ తిరిగి అమెరికాలో సర్వీసులు ప్రారంభించే ప్రక్రియ చేపట్టింది. ఇందుకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు చెబుతున్నాం.’’ అని టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. అంతేకాదు.. టిక్ టాక్ ను అమెరికాలో కొనసాగిస్తూ.. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి పనిచేస్తామని టిక్ టాక్ తన స్టేట్ మెంట్ లో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com