Donald Trump: ఇకపై అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు..

ఇకపై అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘ వలసదారుల పిల్లలకు పౌరసత్వాన్ని మా ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్ తెలిపారు. వలస విధానంపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఇది ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ తన ప్రసంగంలో అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తున్నట్లు తప్పుగా పేర్కొన్నారు. వాస్తవానికి ప్రపంచంలో 30కి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తూ పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి.
ఫిబ్రవరి 19, 2025 నుండి అమెరికాలో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు, H1, L1 వీసాలపై ఉన్న వ్యక్తులకు జన్మించిన పిల్లలు ఇకపై అమెరికా పౌరులుగా పరిగణించబడరని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాలో 1868లో ప్రవేశపెట్టిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అక్కడ పుట్టిన ప్రతి చిన్నారికి పౌరసత్వ హక్కు లభిస్తుంది. ఈ విధానం దశాబ్దాలుగా అమలులో ఉంది. వలసదారుల పిల్లలు, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారి పిల్లలు కూడా ఈ చట్టం కింద పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంది. ఈ విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం న్యాయపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 14వ రాజ్యాంగ సవరణ అమెరికా చట్టవ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. దీన్ని రద్దు చేయాలంటే తీవ్ర చర్చలు, న్యాయపరమైన చర్యలు అవసరం అవుతాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో వలస విధానంపై చర్చకు దారితీసింది. వలసదారుల పిల్లలకు పౌరసత్వాన్ని రద్దు చేయడం వలసదారుల హక్కులను నష్టపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తుందా లేదా అన్నది న్యాయసంస్థ నిర్ణయిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com