Donald Trump On Tiktalk: టిక్‌టాక్‌పై నిషేధం ఆపమన్న ట్రంప్

అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్ యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్‌టాక్‌పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.
వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు.
కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.
ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్‌టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోనని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com