Donald Trump: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాకు మాత్రం

చైనాతో టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు కీలక ప్రకటనలు చేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు సుంకాల నుంచి ఊరట కల్పించారు. చైనాపై అమెరికా 104 శాతం పన్ను విధించింది. ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34 శాతంగా ఉన్న పన్నును 84 శాతానికి పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.
అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాల పెంపును తీవ్రంగా పరిగణించిన ట్రంప్ చైనా ఉత్పత్తులపై ఉన్న 104 శాతం పన్నును 125 శాతానికి పెంచినట్టు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాలను దోచుకొనే రోజులు ఇకపై ఉండవని, అది ఆమోదయోగ్యం కాదని చైనా సమీప భవిష్యత్తులోనే గ్రహిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే, టారిఫ్ గాయాల నుంచి ఇతర దేశాలకు ఉపశమనం కల్పిస్తూ 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, సార్వత్రిక రేటు 10 శాతం పన్నులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com