Donal Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ కు లైన్ క్లియర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులోఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ట్రంప్ తాజాగా న్యూ హాంప్‌షైర్‌లోనూ విజయకేతనం ఎగురవేశారు. అభ్యర్థిత్వం కోసం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన పోరులో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్‌నకు 55 శాతం ఓట్లు రాగా నిక్కీ హేలీకి 44 శాతం ఓట్లు వచ్చాయి.
న్యూ హాంప్‌షైర్‌లో 22 మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఉండగా ట్రంప్‌నకు 11, హేలీకి 8 మంది మద్దతిచ్చారు. హేలీ అంచనాల కంటే మెరుగ్గానే రాణించారని.... అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష పదవిలో లేకుండా వరుసగా. అయోవా, న్యూ హాంప్‌షైర్‌లో గెలుపొందిన తొలి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ రికార్డు సాధించారు.అంతేకాదు న్యూ హాంప్‌షైర్‌లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన.. ఏకైక రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు. ఈ విజయంతో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌నకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో తలపడే అవకాశం ఉంది.
అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీ అంతా ట్రంప్, నిక్కీ హేలీ మధ్యే ఉంది.పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్‌నకు మద్దతు ప్రకటించాలని ఇటీవల రేసు నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి నిక్కీ హేలీకి సూచించారు. హేలీ మాత్రం రేసులో కొనసాగడానికే నిర్ణయించుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఓవైపు ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూనే రేసు ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించారు. పోటీ ఇంకా తొలి దశలోనే ఉందని ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని హేలీ చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మొత్తం 14 మంది పోటీకి దిగగా చివరకు తాను మాత్రమే ట్రంప్‌తో పోరాడుతున్నానని తెలిపారు.
మరోవైపు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో విజయం సాధించారు. ఎలాంటి ప్రచారాలు చేయకుండానే ఆయన గెలపొందారు. పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ ను గెలిపించాలని ఆయన మద్దతుదారులు ప్రచారం చేశారు. మాజీ, ప్రస్తుత అధ్యక్షులు వరుసగా ప్రైమరీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ మధ్యే పోటీ ఉండేలా కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేశకులు అభిప్రాయపడుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com