ర్యాలీలో డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ర్యాలీలో డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
ఇటు కరోనా వైరస్‌ మరింతగా పెరుగుతోంది.. అటు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అమెరికాలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.. హోరాహోరీగా ప్రచారం..

ఇటు కరోనా వైరస్‌ మరింతగా పెరుగుతోంది.. అటు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అమెరికాలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.. హోరాహోరీగా ప్రచారం జరుగుతండగా, విజయం కోసం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీ గెలిచిన ఫ్లోరిడా, జార్జియాల్లో మరోసారి తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన చెమటోడుస్తున్నారు. మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగు ఏళ్లపాటు అమెరికాను తాను పరిపాలించబోతున్నట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న ట్రంప్‌... అమెరికా చరిత్రలోనే ఇవి అతి ముఖ్యమైన ఎన్నికలుగా అభివర్ణించారు. మనం తిరిగి అధికారంలోకి రాబోతున్నామని.. భవిష్యత్తులో కూడా రిపబ్లికన్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని తన మద్దతుదారులను ట్రంప్‌ కోరారు.

తన ప్రత్యర్థి జో బైడెన్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ గెలిస్తే కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తారని, క్రిమినల్స్ మొత్తం దేశంలోకి చొరబడతారని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఓ వరస్ట్ క్యాండెట్‌తో పోటీ పడాల్సి రావడం తన మీద ఒత్తిడి పెంచుతోందన్నారు. తాను ఓడిపోతే బహుశా దేశం విడిచి వెళ్లిపోతానేమో.. చెప్పలేను అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ చేసిన కామెంట్స్‌ను ఆధారంగా చేసుకుని ఆయన ప్రత్యర్థి జో బైడెన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందన్న ట్రంప్ కామెంట్స్‌ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన బైడెన్, ప్రామిస్.. అంటూ కామెంట్ చేశారు.

ఇప్పుడే కాదు, ఇటీవల వరుసగా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు ట్రంప్‌. మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తూ ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదనేది సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.. దీనిని బట్టి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించడానికి ట్రంప్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అటు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడంతోపాటు, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది. అలాగే తప్పుడు సమాచారానికి సంబంధించిన 150 మిలియన్ ఉదాహరణల తాలూకు హెచ్ఛరికలను కూడా పోస్ట్ చేశామని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ తెలిపారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా నుంచి ఓటర్ మానిప్యులేషన్ కి జరిగిన ప్రయత్నాలను తాము మరిచిపోలేదన్నారు. ఇప్పుడు ఆ విధమైన ప్రయత్నాలు జరగకుండా చూసేందుకు 35 వేలమంది ఉద్యోగులు అలర్ట్ గా ఉన్నారని నిక్ వెల్లడించారు. అందిన సమాచారం వెరిఫై చేసేందుకు ఫ్రాన్స్‌ సహా 70 స్పెషలైజ్డ్ మీడియా సంస్థలతో తాము భాగస్వామ్యం వహిస్తున్నామని నిక్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story