Thailand : దేశంలోకి అక్రమంగా 306 తాబేళ్లు

Thailand : దేశంలోకి అక్రమంగా 306 తాబేళ్లు
ఎవరు.. ఎందుకు పంపారో ఆరా తీస్తున్న అధికారులు

థాయిలాండ్ నుంచి అనుకోని అతిధులు మన దేశానికి వచ్చారు. చెప్పాపెట్టకుండా, తగిన పత్రాలు లేకుండా భారత్ లో ఎంటర్ అయ్యారు. అందుకే వాటిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత ప్రయత్నించినా వాటి నుంచి అధికారులు ఒక్క సమాచారం కూడా పొందలేకపోతున్నారు. ఎందుకంటే అవి మనుషులు కావు కాబట్టి.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ముంబై జోనల్ యూనిట్ ఓ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది. థాయ్‌లాండ్‌ నుంచి భారత్ అక్రమంగా వచ్చిన 306 బుజ్జి తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. థాయిలాండ్ నుంచి భారతదేశానికి ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ద్వారా వీటిని అక్రమంగా తరలించగా DRI ముంబై డివిజనల్ యూనిట్ కనిపెట్టేసింది. అంతరించిపోతున్న జంతుజాలం, వృక్షజాలానికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంపై ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నారు.


మొదట థాయిలాండ్ నుంచి భారత్‌కు, డెకరేషన్ కోసం ఉపయోగించే చేపలు వచ్చాయని తెలియడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు.. హడావుడిగా ముంబై సాహాలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 100 తాబేళ్లు,110 నత్తలు, 62 సముద్ర తాబేళ్లు, 30 చిన్న పీతలు, 4 స్టింగ్-రే చేపలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ చక్కని బాక్సుల్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ తాబేళ్లలో గ్రీక్ టార్టాయిస్, రెడ్-ఫుడెడ్ టార్టాయిస్, ఆసియన్ స్పర్ర్‌డ్ టార్టాయిస్, ఎల్లో స్పాట్టెడ్ టర్టిల్, అల్బినో రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్, ఆసియన్ లీఫ్ టర్టిల్, రెడ్ బెల్లీ షార్ట్ హెడ్ టర్టిల్ వంటి రకాలు ఉన్నాయి. వీటిని ఎవరు, ఎక్కడికి పంపారో, ఎందుకు పంపారో వంటి వివరాలు తెలుసుకొని.. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీనిపై ఇతర అధికారులతో మాట్లాడి వాటిని ఏం చెయ్యాలో నిర్ణయిస్తామన్నారు అధికారులు.

ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులు, చెరువులు, బావుల్లో మనుగడ సాగించే తాబేళ్లలో 356 జాతులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా అంటే, 187 జాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సంగతిని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ (ఐయూసీఎన్‌) వెల్లడించింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వీటిలోని పలు జాతులు ఈ శతాబ్ది ముగియక మునుపే పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదం అంచుల్లో ఉన్న తాబేళ్ల జాతులను, అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్న తాబేళ్ల జాతులను తన ‘రెడ్‌ లిస్ట్‌’లో చేర్చింది.

Tags

Read MoreRead Less
Next Story