Russia: మాస్కో ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి

Russia: మాస్కో ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి
ఉగ్రవాద చర్యే అంటూ ఉక్రెయిన్ పై మండిపడుతున్న రష్యా

రష్యా రాజధాని మాస్కో లోని అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది రష్యా విదేశాంగ శాఖ. ఈ దాడి వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని ఆరోపించింది.

ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేప‌ట్ట‌డాన్ని ఉగ్ర‌వాద చ‌ర్యగా ప్రకటించింది ర‌ష్యా. మాస్కో స‌హా రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాలపై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. దీనివల్ల రాజధానిలోని ప్రధాన విమానాశ్రయాలలో విమానాలకు అంతరాయం కలిగించింద‌ని పేర్కొంది. మాస్కో ప్రాంతంలో క్రెమ్లిన్‌కు నైరుతి దిశలో కేవలం 30 కిమీ దూరంలో ఉన్న ప్రాంతాల్లోని గ‌గ‌న‌త‌లంలో కనీసం మూడు డ్రోన్‌లను అడ్డ‌గించిన‌ట్టు ర‌ష్య‌న్ మీడియా పేర్కొంది. డ్రోన్‌ల క‌ల‌క‌లంతో మాస్కోలోని వ్నుకోవో విమానాశ్ర‌యంలో ప‌లు గంట‌ల పాటు విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌లు నిలిచిపోయాయి. ప‌లు విమానాల‌ను ఇత‌ర ఎయిర్‌పోర్టుల‌కు దారిమ‌ళ్లించారు. ఎయిర్‌పోర్ట్ స‌హా పౌర మౌలిక స‌దుపాయాలున్న ప్రాంతంలో ఉక్రెయిన్ చేప‌ట్టిన దాడి మ‌రో ఉగ్ర‌వాద చ‌ర్యేన‌ని రష్యా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జ‌ఖ‌రొవ స్ప‌ష్టం చేశారు.




ఉగ్ర‌వాద ప్ర‌భుత్వానికి ఐక్య‌రాజ్య‌స‌మితిలో శాశ్వ‌త స‌భ్యులైన‌ అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ ఆర్ధిక సాయం అందిస్తున్నాయ‌ని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై ఉక్రెయిన్ ఇంకా స్పందించ‌లేదు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల‌ను ర‌క్ష‌ణ‌, వైమానిక ద‌ళాలు తిప్పికొట్టాయ‌ని మాస్కో మేయ‌ర్ సెర్గీ సొబ‌య‌న్ తెలిపారు. గుర్తించిన డ్రోన్‌ల‌న్నింటినీ తొల‌గించామ‌ని, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. అలా అని ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు అంత సజావుగా లేని సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు రష్యా అధీనంలోని భూభాగాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. గతంలో క్రెమ్లిన్ అధ్యక్ష భవనాలపైకి కూడా డ్రోన్లు దూసుకొచ్చాయి. వీటన్నింటికి ఉక్రెయినే కారణమని రష్యా ఆరోపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story