Airport Rankes: వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు..

Airport Rankes: వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు..
X
తొలి స్థానంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు

ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, 2024 సంవత్సరానికి గాను అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల జాబితా విడుదలైంది. అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం (ATL) మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL) ఈ జాబితాలో టాప్ 10లో స్థానం సంపాదించడం విశేషం.

2024లో అట్లాంటా విమానాశ్రయం మొత్తం 108.1 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించింది. ఇది 2023తో పోలిస్తే 3.3% అధికం అయినప్పటికీ, 2019 కోవిడ్-పూర్వ స్థాయిల కంటే ఇంకా 2% తక్కువగానే ఉంది. అమెరికా అంతటా మరియు ఇతర దేశాలకు తిరుగులేని కనెక్టివిటీ కారణంగా అట్లాంటా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వరల్డ్ నివేదిక ప్రకారం, 2024లో 92.3 మిలియన్ల మంది ప్రయాణికులతో దుబాయ్ 6.1% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలను కనెక్ట్ చేయడంలో ఎమిరేట్స్ పాత్ర బలోపేతం అవ్వడం ఈ వృద్ధికి దోహదపడింది. డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం (DFW) 87.8 మిలియన్ల ప్రయాణికులతో (7.4% వృద్ధి) మూడో స్థానంలో నిలిచింది. ఇది 2019 స్థాయిల కంటే 17% అధికం కావడం గమనార్హం.

ఆసియా విమానాశ్రయాలలో, టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ (HND) 85.9 మిలియన్ల ప్రయాణికులతో (9.1% వృద్ధి) నాలుగో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రయాణాలు పుంజుకోవడం, జపాన్ పర్యాటక రంగం పునరుద్ధరణ దీనికి కారణమయ్యాయి. లండన్ హీత్రో విమానాశ్రయం (LHR) 83.9 మిలియన్ల ప్రయాణికులతో (5.9% వృద్ధి) ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇక భారతదేశానికి చెందిన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL) ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేసింది. 2024లో 77.8 మిలియన్ల ప్రయాణికులతో, 2023 కంటే 7.8% వృద్ధితో 9వ స్థానంలో నిలిచింది. దేశీయ విమాన ప్రయాణాల వేగవంతమైన పెరుగుదల, అంతర్జాతీయ మార్గాల విస్తరణ DEL ఎదుగుదలకు దోహదపడుతున్నాయి. ఇది దక్షిణాసియాకు కీలక కేంద్రంగా మారుతోంది.

ఇతర ముఖ్య విమానాశ్రయాలలో డెన్వర్ (DEN) 82.4 మిలియన్ల ప్రయాణికులతో ఆరో స్థానంలో, ఇస్తాంబుల్ (IST) 80.1 మిలియన్లతో ఏడో స్థానంలో, చికాగో ఓ'హేర్ (ORD) 80 మిలియన్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్ విమానాశ్రయం 2019తో పోలిస్తే ఏకంగా 53% వృద్ధిని సాధించడం విశేషం. చైనాలోని షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (PVG) అనూహ్యంగా పురోగమించింది. 2023లో 21వ స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయం, 2024లో 76.8 మిలియన్ల ప్రయాణికులతో (41% అద్భుతమైన వృద్ధి) పదో స్థానానికి దూసుకువచ్చింది.

Tags

Next Story