Dubai Rains: దుబాయ్ లో మళ్లీ వర్షాలు...
వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీవ్ర వర్షాలతో అల్లాడిపోతోంది. గత నెలలో భారీ వర్షాలతో వణికిపోయిన దేశం మరోసారి గురువారం కూడా కుంభవృష్టి వర్షంతో అల్లకల్లోలం అయింది. బుధవారం రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో కూడా వర్షాలు కురవడం ప్రారంభం కాగా అది, గురువారం వరకు తీవ్రం కావడంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలలోపు 50 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
వర్షాల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో పలు విమాన, బస్ సర్వీసులను రద్దు చేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. అబుదాబిలోని చాలా వీధుల్లో వరద నీరు నిలిచిపోయింది. రాత్రి మూడు గంటల నుంచే ఉరుములు, బలమైన ఈదురుగాలులతో భారీ వాన ప్రారంభమైనట్టు దుబాయ్ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు (Airlines) తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ కూడా పలు సూచనలు చేశాయి. మే 5 వరకు విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశముందని, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తామని పేర్కొన్నాయి.
ఏప్రిల్ 14-15 తేదీల్లో యూఈఏని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దుబాయ్ నగరంలో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అప్పటితో పోలిస్తే తాజా వర్షాల ప్రభావం తక్కువే అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com