Dubai Princess: ఇన్‌స్టాలో విడాకులు ఇచ్చిన దుబాయ్‌ యువరాణి

Dubai Princess: ఇన్‌స్టాలో విడాకులు ఇచ్చిన దుబాయ్‌ యువరాణి
యూఏఈ ప్రధాని కుమార్తె షైకా సోషల్ మీడియా పోస్టు సంచలనం

దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కుమార్తె షైకా మహ్రా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన ప్రకటన చేశారు. అయితే వారిద్దరికీ ఏడాది క్రితమే పెళ్లి కాగా.. రెండు నెలల క్రితం మొదటి సంతానం జన్మించింది. ఇక సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడం, కలిసి దిగిన ఫోటోలను తొలగించడంతో వారి విడాకుల వార్త తెగ వైరల్ అవుతోంది.

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ సంచలనంగా మారింది. తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ‘ఐ డైవర్స్‌ యూ.. ఐ డైవర్స్‌ యూ అండ్ ఐ డైవర్స్‌ యూ’. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య’’ అని షైకా మహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌, షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా డిలీట్‌ చేశారు. దీంతో ఈ వార్త వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో ఒకరినొకరు బ్లాక్‌ చేసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు.. షైకా మహ్రా అకౌంట్ హ్యాక్‌ అయ్యిందని ఇంకొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే తన భర్త చేసిన మోసాన్ని బయటపెట్టి.. ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దుబాయ్ యువరాణి షైకా బ్రిటన్ లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు.


Tags

Next Story