Dubai Princess : భర్తకు విడాకులిచ్చి..ర్యాపర్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకున్న దుబాయ్‌ యువరాణి

Dubai Princess : భర్తకు విడాకులిచ్చి..ర్యాపర్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకున్న దుబాయ్‌ యువరాణి
X
దుబాయ్ పాలకుడి కుమార్తె షేఖా మహ్రా సంచలన నిర్ణయం

దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేఖా మహ్రా (31) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా (40)తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మోంటానా ప్రతినిధి ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. వీరిద్దరి ప్రేమకథ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

గత జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఈ జంట తమ బంధాన్ని అధికారికం చేసుకున్నట్లు సమాచారం. 2024 చివర్లో షేఖా మహ్రా స్వయంగా దుబాయ్‌ను మోంటానాకు చుట్టి చూపించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి దుబాయ్, మొరాకో, పారిస్ వంటి నగరాల్లో పలుమార్లు కలిసి కనిపించడంతో వారి సంబంధంపై ఊహాగానాలు బలపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంలో పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లలో చేతిలో చేయి వేసుకుని కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం బహిర్గతమైంది.

షేఖా మహ్రాకు ఇదివరకే షేక్ మానా బిన్ మొహమ్మద్‌తో వివాహమైంది. 2023 మేలో వీరి పెళ్లి జరగ్గా, వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, తన భర్త ద్రోహం చేశారంటూ ఆరోపిస్తూ గతేడాది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహ్రా విడాకులు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె "డివోర్స్" పేరుతో సొంతంగా పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె యూకే విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ సంబంధాల విభాగంలో డిగ్రీ ప‌ట్టా పొందారు.

ఇక ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా అసలు పేరు కరీమ్ ఖర్‌బౌచ్. "అన్‌ఫర్‌గెటబుల్", "నో స్టైలిస్ట్" వంటి అంతర్జాతీయ హిట్‌లతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సంగీతంతో పాటు ఉగాండా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దాతగానూ పేరు తెచ్చుకున్నారు. మోంటానాకు కూడా గతంలో నదీన్ ఖర్‌బౌచ్‌తో వివాహమై విడాకులు అయ్యాయి. వారికి క్రుజ్ ఖర్‌బౌచ్ అనే 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

Tags

Next Story