Earth Hour: ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ కూడా

Earth Hour: ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ కూడా
X
ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఎర్త్ అవర్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకొంటున్నారు. ఈ నేపధ్యంలో మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది.. ఢిల్లీతోపాటు హైదరాబాద్‌ నగరంలో ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు. దీనికోసం అందరూ లైట్లను ఆపి ఎర్త్ అవర్ కార్యక్రమానికి మద్దతు తెలపనున్నారు.

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ సంవత్సరానికి ఒకసారి నిర్వహించే కార్యక్రమమే ఈ 'ఎర్త్ అవర్'. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ పురుడుపోసుకుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) దీనిని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు. తొలి పిలుపునకే అనూహ్య స్పందన లభించింది. లక్షలాదిమంది ప్రజలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి.

ఎర్త్ అవర్ సమయంలో.. కమ్యూనిటీలు, వ్యాపారులంతా భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యులు పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక గంటసేపు లైట్లు ఆర్పాలంటూ పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు పిలుపు నిచ్చాయి. అంతేకాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా ఎర్త్ అవర్ ను పాటించనున్నాయి. పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఎర్త్ అవర్ ను నిర్వహిస్తారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ఈ చొరవ ముఖ్యమైనది.

ఎర్త్ అవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డంత విద్యుత్తు ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే. కానీ, దీని ద్వారా ప్రపంచానికి ప్రభావవంతమైన సందేశం వెళ్తుంది. పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది బయటపెడుతుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని రక్షించాలన్న నిబద్ధతను ఇతరులతో పంచుకునేందుకు, సంఘీభావం ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది.

Tags

Next Story