Earthquake: బుడతడిని రెస్క్యూ చేసి ముద్దాడి..

శిధిలాల కింద రెండేళ్ల చిన్నారిని కాపాడిన కొసోవో రెస్క్యూ బృందం

టర్కీ,సిరియాలలోని భూకంప ప్రభావిత ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు కంటతడిపెట్టుస్తున్నాయి. పెద్దసంఖ్యలో భవనాలు నేలకూలడంతో దేశం మొత్తం శవాల దిబ్బగా మారింది. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నా.. సిబ్బంది సరిపోవడంలేదు. భూకంప మృతులు గంట గంటలకు పెరుగుతున్నారు. ఒక్క టర్కీలోనే సుమారు 9 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించారు. సిరియాలో సుమారు 3వేల మందికిపైగా మరణించినట్లు తెలుస్తుంది. భవనాల శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా ప్రాణం లేని దేహాలే కనబడుతున్న దృశ్యాలు యావత్‌ ప్రపంచం హృదయాలను మెలిపెట్టేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు 60వేల మందికిపైగా పాల్గొంటున్నారు.అయినా పెద్దయెత్తున భవనాలు కూలడంతో వారు ఎక్కడా సరిపోవడంలేదు. ఇప్పటివరకు దాదాపు 8వేలమందిని ప్రాణాలతో రక్షించారు. మరోవైపు, శిథిలాల కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని రెస్క్యూ సిబ్బంది గుర్తిస్తున్నారు. వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇలాంటి విడియో ఒకటి బయట పడింది. రెండేళ్ల చిన్నారి శిధిలాల కింద ఇరుక్కోగా కొసోవో రెస్క్యూ బృందం ఆ బుజ్జికన్నయ్యను రక్షించింది. చూడ ముచ్చటగా ఉన్న చిట్టి తండ్రిని రెస్క్యూ బృందాల సభ్యులు తలపై ముద్దాడుతూ స్ట్రెచర్‌మీదకు తీసుకెళుతున్న దృశ్యాలు నెట్టింట్లొ వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసినవారి హృదయాలు ద్రవించక మానదు.

Tags

Read MoreRead Less
Next Story