Afghanistan: అనాధగా మిగిలిన అఫ్గానిస్తాన్‌?

Afghanistan:  అనాధగా మిగిలిన అఫ్గానిస్తాన్‌?
అందరి ద్రుష్టి ఇజ్రాయెల్‌ పరిణామాలపైనే

అఫ్గానిస్థాన్‌ హెరాత్‌లో సంభవించిన పెను భూకంపంలో మృతులసంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తులో 2వేల 445 మంది మరణించగా వేలాది మంది గాయపడినట్టు అఫ్గన్‌ సర్కార్‌ ప్రకటించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలు రాగా హెరాత్‌ ప్రావిన్స్‌ అల్లాడిపోయింది. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది నివాసితులు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్వచ్ఛంద సంస్థలలు......, స్థానికులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అఫ్గాన్‌కు 10 అంబులెన్స్‌లు, వైద్య సామాగ్రి పంపించింది. 10వేల ప్రాథమిక చికిత్స కిట్లను.., 5వేల కుటుంబాలకు అవసరమైన సామాగ్రిని, 15వందల జతల బట్టలను, దుప్పట్లను ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్‌ ఫండ్‌ అందించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసి అఫ్గాన్‌కు అండగా నిలబడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుట్టెరస్‌ పిలుపునిచ్చారు.

అఫ్గానిస్తాన్‌లోని హెరాట్‌ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మరిన్ని మృతదేగాలు బయటపడే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు.

మరోవైపు అఫ్గాన్‌ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్‌ బరాదర్‌ సోమవారం హెరాట్‌ ప్రావిన్స్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్‌ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్‌లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్‌ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్‌ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్‌లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story