Earthquake: ఇరాన్ లో మరోసారి భూకంపం..అణు పరీక్షలే కారణమా?

ఓవైపు ఇజ్రాయెల్ భీకర దాడులతో బెంబేలెత్తిస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణులతో అటాక్ చేస్తోంది. దీంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదే సమయంలో ఆ దేశంలో మరో కలకలం చెలరేగింది. ఇరాన్ లో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి.
సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సెమ్నాన్ నగరానికి ఆగ్నేయంగా 35 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ భూకంపాన్ని నిర్దారించింది. ఇజ్రాయల్ తో ఘర్షణలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో భూప్రకంపనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయల్ తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని, భూకంపానికి ఇది కారణం కావొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. స్పేస్ క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
ఇరాన్ లోని సెమ్నాన్ ఫ్రావిన్స్ లోనే స్పేస్ సెంటర్, మిస్సైల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. అక్కడి రక్షణశాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం సంభవించింది. భారీగా ప్రకంపనలు ఉత్తర ఇరాన్ లోని అనేక ప్రాంతాలను తాకినట్లు సమాచారం. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
ప్రపంచంలో భూకంపం ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఏడాదికి దాదాపు 2వేలకు పైగా భూకంపాలు నమోదవుతుంటాయి అక్కడ. వీటిలో 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి 15 నుంచి 16 వరకు ఉంటాయి. అణ్వాయుధ కార్యకలాపాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలుళ్లు తీవ్ర ప్రకంపనలకు కారణం అవుతుంటాయి. పేలుడు సంభవించే ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరగడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతుంటారు. ఇవి పేలుడు వల్ల సంభవించాయా లేక సాధారణ ప్రకంపనలా అనేది తరంగాలను అధ్యయనం చేయడం ద్వారానే తెలుసుకోవచ్చు.
ఇది న్యూక్లియర్ కార్యకలాపాలు లేదా ఇజ్రాయెల్ సైనిక దాడులతో సంబంధం ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవు. ఎందుకంటే ఇరాన్ ఆల్పైన్ హిమాలయన్ భూకంప బెల్ట్ పై ఉంది. ఇది తరచూ సహజ భూకంపాలకు గురవుతుంది. మరోవైపు భూగర్భ న్యూక్లియర్ పేలుళ్లతో చినపాటి ప్రకంపనలు వస్తుంటాయి. కానీ, ఇవి సాధారణంగా తక్కువ తీవ్రతతో ఉంటాయి.
సెమ్నాన్ సమీపంలో భూకంపాలు సహజ భూకంప నమూనాలతో సమానంగా ఉన్నాయి. సెమ్నాన్ లోని భూకంపానికి సంబంధించి అణు పరీక్షల వాదనని నిపుణులు తోసి పుచ్చారు. 10 కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు నిర్వహించరని చెప్పారు. భౌగోళికంగా ఇది సాధ్యం కాదని కొందరు నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com