Murder: హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఆధారంగా లొకేషన్ కనుక్కుని వచ్చి యువతిని కాల్చి చంపిన ఘటన ఈక్వెడార్‌లో సంచలనం రేపింది. పట్టపగలు రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి తుపాకీత కాల్చి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో ఈక్వెడార్ బ్యూటీ క్వీన్ లాండీ పరాగా గోయ్‌బురో ప్రాణాలు కోల్పోయారు. తాను రెస్టారెంట్‌లో ఉన్న్టట్టు అంతకుముందుదే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీని ఆధారంగానే దుండగులు అక్కడికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
న్యూయార్క్ పోస్ట్ సమాచారం ప్రకారం.. రెస్టారెంట్‌లో ఓ వ్యక్తితో గోయ్‌బురో మాట్లాడుతుండగా ముసుగేసుకుని ఇద్దరు దుండగులు లోపలికి చొరబడటం ఆమె గమనించింది. ఇంతలోనే ఒక సాయుధుడు గోయ్‌బురోపై, ఆమె మాట్లాడుతున్న వ్యక్తిపై కూడా కాల్పులు జరిపాడు. తర్వాత దుండగులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బుల్లెట్ గాయాలతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను చంపడానికి కారణాలు వెల్లడి కాలేదు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
2022 మిస్ ఈక్వెడార్ పోటీలో లాస్ రియోస్ ప్రావిన్స్‌కు లాండీ పరాగా గోయ్‌బురో ప్రాతినిధ్యం వహించారు. సోషల్ మీడియాలో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. చనిపోయిన డ్రగ్ ట్రాఫికర్ లియాండ్రో నోరెరో, అతడి అకౌంటెంట్ హెలివ్‌తో చాటింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో గత డిసెంబర్‌లో ఆమె వార్తలకెక్కారు. ఆమెకు మాదకద్రవ్యాల డీలర్ లియోనార్డో నోరెరోతో అఫైర్ ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానిక అటార్నీ జనరల్ కార్యాలయం ఆమె ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో గోయ్‌బురోను అధికారులు విచారించలేదు. ఆమె కూడా నోరెరో గురించి ఎప్పుడూ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.
గోయ్‌బురోను, నోరెరో భార్యే హత్య చేయించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్తతో సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆమె ఇదంతా చేయించి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. గోయ్‌బురో హత్య వెనుకున్న కారణాలు, ఎవరు చేయించారనేది పోలీసుల విచారణలో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com