Imran Khan: పాకిస్థాన్ జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై దాడి

పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోదరికి ఘోర అవమానం జరిగింది. దుండగులు దారుణానికి ఒడిగట్టారు. మీడియాతో మాట్లాడుతుండగా హఠాత్తుగా కోడిగుడ్డు విసిరారు. ముఖం మీద తగలడంతో హడలిపోయింది. ఆమెతో పాటు చుట్టు ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ మీడియాతో మాట్లాడుతుంది. తోషఖానా కేసు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంకొన్ని ప్రశ్నలను ఆమె దాట వేసింది. దీంతో మీకు నచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి.. నచ్చని ప్రశ్నలను దాట వేస్తారంటూ ఆమెపై కోడిగుడ్డు విసిరారు. ఆమె గడ్డానికి తగిలి బట్టలపై చిందింది. అంతేకాకుండా ఈ హఠాత్తు పరిమాణంతో ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడింది. ఒక మహిళ ‘ఇది ఎవరు?’, ‘కిస్నే కియా యే (ఇది ఎవరు చేసారు)’ అని అరుస్తున్నట్లు కనిపించింది. అలీమా ఖనుమ్ మాత్రం షాక్‌లోకి వెళ్లిపోయింది. మిగతా వారు గుడ్డు విసిరిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు.. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులని చెప్పారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నను అలీమా ఖనుమ్ దాటవేయడంతో గుడ్డు విసిరారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ దాడిని పీటీఐ మద్దతుదారులు ఖండించారు. ఇటు చర్య అనైతికమే కాదు.. దురదృష్టకరం కూడా అని వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్య రాజకీయ విభేదాలు, అవమానాలు.. దాడులకు ప్రేరేపిస్తోందని తెలిపింది. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. కానీ మర్యాద.. గౌరవాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని పేర్కొంది. అయితే ఇమ్రాన్‌ఖాన్ కుటుంబాన్ని భయపెట్టేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తోషాఖాన్ అంటే ఏంటి? అసలు ఈ కేసేంటి?
తోషాఖానా లేదా ట్రెజర్ హౌస్. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే బహుమతులు ఉంటాయి. తోషాఖానాలో ప్రధాన మంత్రులు, అధ్యక్షులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారులు అందుకున్న విలువైన బహుమతులు ఉంటాయి. 2023, ఆగస్టులో 140 మిలియన్ల పాకిస్థానీ రూపాయల ($500,000) కంటే ఎక్కువ విలువైన బహుమతులను ఇమ్రాన్‌ఖాన్ అమ్మేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్‌ఖాన్, అతని భార్య బుష్రా బీబీపై తోషాఖానా కేసు నడుస్తోంది. శుక్రవారం విచారణ జరిగి వాయిదా పడింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com