Cage Fight: ఇటలీ వేదికగా కుభేరుల కొట్లాట

ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ల మధ్య కేజ్ ఫైట్(Cage Fight )కు ఇటలీ(Italy) వేదిక కానుంది. రోమ్ నగరంలోని పురాతన సెటప్‌లో ఈ పోరు జరగనుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Musk post ) అధికారికంగా ప్రకటించాడు. ఈ ఫైట్‌ను ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్( Mark Zuckerberg ) ఫౌండేషన్లు నిర్వహిస్తాయని మస్క్ తెలిపాడు. కెమెరాలో కనిపించే ప్రతి ఫ్రేమ్ పురాతన రోమ్ తరహాలోనే ఉంటుందని, ఇప్పటిలా ఏమీ ఉండదని స్పష్టం చేశాడు. ఈ విషయమై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ( Italian Prime Minister Giorgia Meloni), అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. ఇటలీ గతాన్ని, వర్తమానాన్ని గౌరవించేలా ప్రతీది ఉంటుంది’ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. లొకేషన్ విషయంలో వారి అంగీకారం దొరికినట్లు తెలిపాడు. ఈ పోరు ఎక్స్‌తో పాటు మెటాలలో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందని మరోసారి వెల్లడించాడు.
సామాజిక దిగ్గజ సంస్థల అధినేతలైన ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్ జరగనుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌ను ఏతేదీన ఈ పోరు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఆగస్టు 26న జరిపేందుకు సిద్ధమని జూకర్ బర్గ్ ప్రకటించినప్పటికీ.. మస్క్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తమ మధ్య జరిగే పోరు ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయని ఎలాన్ మస్క్ ఇప్పటికే వెల్లడించాడు.
ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేథకు సంబంధించిన విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇవి గత నెలలో తారాస్థాయికి చేరాయి. ఎక్స్‌కు పోటీగా జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌ను తీసుకొచ్చారు. దీనిపై ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. పరస్పర విమర్శలు చేసుకునే క్రమంలోనే జుకర్‌బర్గ్ ఒప్పుకుంటే కేజ్ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్ ట్వీట్ చేశారు. జుకర్‌బర్గ్ కూడా మస్క్‌కు అదే రీతిలో సమాధాన మిచ్చారు. ఎక్కడో చెప్పు అంటూ సవాల్ విసిరారు. వెగాస్ ఆక్టాగాన్..రా చూసుకుందాం అంటూ మస్క్ సమాధానమిచ్చారు. దీంతో వీరిద్దరూ కేజ్ ఫైట్‌లో తలపడబోతున్నారని ప్రచారం మొదలైంది.
తొలుత ఇది కేవలం ప్రచారం కోసం జరుగుతుందని నెటిజన్లు భావించారు. కానీ, కొద్ది రోజులుగా ఇరువురు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడం.. శరీరాకృతిని ప్రదరిస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుండటంతో వీరి మధ్య పోరు ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మస్క్ కూడా ట్వీట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com