Starship Rocket: పేలిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్

అంతరిక్ష ప్రయోగంలో ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దక్షిణ ఫ్లోరిడా-బహామాస్ సమీపంలో రాకెట్ పేలిపోయి శిథిలాలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెక్సాస్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హఠాత్తుగా అంతరిక్షంలో ఉండగా పేలిపోయింది. అంతే వేగంగా శిథిలాలు కిందకు వచ్చి పడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై స్పేస్‌ఎక్స్ స్పందించింది. ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ముందుగా నిర్ణయించిన మార్గంలో త్వరగా వెళ్లలేకపోయిందని.. అనంతరం రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. స్టార్‌షిప్ విశ్వసనీయతను మెరుగుపరచడానికి పాఠాలు నేర్చుకుంటున్నట్లు పేర్కొంది.
ఇక భారీ శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లో తారాజువ్వల్లా కనిపించాయి. దీని వల్ల ఎయిర్ ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రమాదం తర్వాత కరేబియన్ ప్రాంతంలోని అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. శిథిలాలు కిందకు దూసుకురావడంతో మయామి, ఫోర్ట్ లాడర్‌డేల్, పామ్ బీచ్, ఓర్లాండో విమానాశ్రయాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
జనవరిలో కూడా ఒక ప్రయోగం విఫలమైంది. రెండు నెలల తర్వాత చేపట్టిన ఈ ప్రయోగం కూడా ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు ప్రయోగాలు కూడా అంతరిక్షంలో పేలిపోయాయి. వాటి శకలాలు కింద పడిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com