PM Modi: ఇథియోపియాలో 'వందేమాతరం'.. పులకించిపోయిన ప్రధాని మోదీ..

PM Modi: ఇథియోపియాలో వందేమాతరం.. పులకించిపోయిన ప్రధాని మోదీ..
X
సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లతో అభినందించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన ముగించుకుని ఇథియోపియా చేరుకున్న ఆయనకు అక్కడ అరుదైన, మర్చిపోలేని స్వాగతం లభించింది. 15 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానికి గౌరవ సూచకంగా ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం 'వందేమాతరం' ఆలపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్.. ప్రధాని మోదీ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక గాయకులు 'వందేమాతరం' గీతాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి ఈ విధంగా స్వాగతం పలికారు. ఈ పరిణామంతో పులకించిపోయిన ప్రధాని మోదీ.. గాయకుల ప్రదర్శనను చప్పట్లతో అభినందించారు.

భారతదేశానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో విదేశీ గడ్డపై ఈ గీతాన్ని ఆలపించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అరుదైన ఘట్టం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.

Next Story