European Tourism: మా దేశానికి రావద్దంటున్న యూరోపియన్లు

European Tourism: మా దేశానికి రావద్దంటున్న యూరోపియన్లు
అతి పర్యాటకంతో అతలాకుతలం సెల్ఫీ దిగితే జరిమానా విధింపు

ఏ దేశానికైనా టూరిజం ముఖ్యం.. భారీగా టూరిస్టులు వస్తే విదేశీ మారకంతో పాటు..ఉపాధి కల్పన, ఆదాయం వస్తుందని ఆయా దేశాలు ఆలోచిస్తుంటాయి. అయితే యూరప్‌లో కొన్ని దేశాలు మాత్రం బాబ్బాబూ మా వద్దకు రాకండి అంటూ టూరిజాన్ని కట్టడి చేస్తోంది. కొవిడ్‌ తర్వాత కొద్దికాలం పర్యాటకం బాగానే అనిపించినా అది కాస్తా మితిమీరింది. ఇబ్బడిముబ్బడిగా పర్యాటకులు వచ్చి పడుతుండటంతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్‌ లాంటి టూరిజం స్పాట్‌లో అయితే స్థానికులు స్వదేశంలో పరాయి వాళ్లుగా మారిపోతున్నామనే ఆందోళనలో పడ్డారు. ఇళ్లు,హోటళ్లు,రోడ్లు,ఆసుపత్రులు, ఏయిర్‌పోర్ట్ లు అన్నీ కిక్కిరిసిపోవటంతో ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారింది. ట్రాఫిక్‌ పెరిగిపోయింది. వాయు, శబ్ద కాలుష్యం పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఉమ్మివేతలు పెరిగాయి. భద్రత తగ్గింది. మొత్తం మీద ఆదాయం పెరిగినా జీవనం దుర్భరంగా మారింది.

ఇక పర్యాటకులకు స్వాగతం అన్న వారే...మా దగ్గరకు రాకండి అనే స్థాయికి వచ్చారు. స్థానికుల నుంచి ప్రభుత్వాలకు టూరిజం తాకిడిని ఆపాలంటూ ఒత్తిడి పెరిగింది. అయితే టూరిజం కారణంగా అనేక దేశాలకు భారీస్థాయిలో విదేశీమారక ద్రవ్యం వస్తుండటం...స్థానికంగానూ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుండటంతో ప్రభుత్వాలకు ఇది ఇబ్బందికరంగా మారింది. నిషేధం విధించడం కన్నా.. కట్టడి చేయటానికి, పర్యాటకుల సంఖ్యను తగ్గించటానికి ఎంట్రీ ఫీజులను భారీగా విధిస్తున్నారు.చివరకు పురాతన చర్చిలను సందర్శించే వారు కూడా ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి వస్తోంది.

అటు ఇటలీలోని వెనిస్‌ కి వచ్చే వారికి 3 నుంచి 10 యూరోల వరకు ఎంట్రీ ఫీజు పెట్టారు. గ్రీస్‌ తమదేశంలోని పురాతన ఆక్రోపోలిస్‌ను చూడటానికి వచ్చేవారికి టైమ్‌ స్లాట్‌లు కేటాయించారు. రోజుకు 20వేల మందికి మించి అనుమతించటం లేదు. పర్యాటకులతో వస్తున్న భారీ ఓడలను ఇటలీ, నెదర్లాండ్స్‌ నిషేధించాయి.ఇటు కొన్ని బీచ్‌లలో, నగరాల్లో ఉండటానికి టైం పీరియడ్‌ ని పెడుతున్నారు. అంతకంటే ఎక్కువ సమయం గడిపితే జరిమానా వేస్తున్నారు.ఇటలీ పోర్టోఫినో సముద్ర తీరంలో సెల్ఫీలు దిగేవారిపై జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నో వెయిటింగ్‌ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఎక్కువ సేపు నిలబడితే 275 యూరోల ఫైన్‌ వేస్తున్నారు.

మరోవైపు యూరప్‌లో అడుగుపెట్టడానికి అమెరికా సహా 60 దేశాల ప్రజలకు వీసా అవసరం లేదు. ఇప్పుడు వారిపైనా ఆంక్షలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. 2024 నుంచి అమెరికా సహా 60 దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై తక్కువ మొత్తంలో ఫీజువసూలు చేయనున్నారు. అంతేకాకుండా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది.

Tags

Next Story