Imran Khan: జైలు జీవితం నరకం

Imran Khan: జైలు జీవితం నరకం
X
బయటకు తీసుకు వెళ్లమంటున్నా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని

తోషాఖానా కేసులో అరెస్టయ్యి ఘోరమైన జైలు జీవితం గడుపుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని, అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోయారు. తనను మరీ సీ-క్లాస్‌ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధించారని, ఆ విషయం పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్‌ ట్రయల్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

తీర్పు వచ్చిన అతి కొద్ది సమయంలోనే ఇమ్రాన్ ను అరెస్టు చేసి.. పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలుకు తరలించారు. అయితే, జైల్లో చిన్న చీకటి గదిలో తనను ఉంచారని, అందులో చీమలు, ఈగలు ఉన్నాయని తనను కలిసిన న్యాయవాదుల ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు అని తెలుస్తోంది. ఈ జైల్లో తాను ఉండలేనని, ఇక్కడ నుంచి తీసుకెళ్లమని కోరినట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇమ్రాన్‌ ఆత్మస్థైర్యంతోనే ఉన్నారని.. బానిసత్వానికి తలొగ్గనని చెప్పినట్లు పాక్‌ మీడియాకు వివరించారు. మరోవైపు అటక్‌ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ సభ్యులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష విధించిన కొన్ని రోజుల్లోనే షెహబాజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తోషాఖానాలోని బహుమతులను వేలం వేయగా వచ్చిన నిధులను.. పేదలు, నిస్సహాయుల కోసం వినియోగిస్తామని షెహబాజ్‌ వెల్లడించినట్లు పాక్‌ పత్రికలు పేర్కొన్నాయి.

పాకిస్థాన్లో 1974లో క్యాబినెట్‌ డివిజన్‌ కింద పనిచేసేలా తోషాఖానా డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ అధినేతకు, పార్లమెంట్‌ సభ్యులకు, అధికారులకు విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులను ఇందులో భద్రపర్చుతారు. కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఒకవేళ వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం కొంత ధర చెల్లించాలి. కానీ ఇమ్రాన్ మరీ తక్కువ ధర చెల్లించి ఈ వస్తువులు సొంతం చేసుకొన్నారు. ఈ కేసులోనే ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

Tags

Next Story