Global Warming: అమెరికా, యూరోప్ దేశాల్లో ఠారెత్తిస్తోన్న ఎండలు

Global Warming: అమెరికా, యూరోప్  దేశాల్లో ఠారెత్తిస్తోన్న ఎండలు
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

అమెరికా నుంచి జపాన్​ వరకు ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో రెడ్​ అలర్ట్​లు అమల్లో ఉన్నాయి. అమెరికా, జపాన్, యూరప్‌లో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజు రోజుకి నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్‌కు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి ఇది అద్ధం పడుతోందంటున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు వేడి గాలులు వీస్తున్నాయి. సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్‌హీట్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇక దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. రివర్‌సైడ్ కౌంటీలో 3వేలకు పైగా ఎకరాల్లో కార్చిచ్చు రేగింది. దీంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.



మరోవైపు భూమిపై ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో కాలిఫోర్నియాలోని డెత్​ వ్యాలీ ఒకటి . ఆ ప్రదేశం కూడా తాజా పరిస్థితులతో అల్లాడిపోతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు ఆదివారం 54 డిగ్రీల సెల్సియస్​ను తాకుతాయని భావిస్తున్నారు. ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తగినన్ని మంచినీరు తాగాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.

గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్ కోసం యూరప్ సిద్ధమవుతోంది. వేడి ప్రభావంతో ఇటలీ కూడా అతలాకుతలమైంది రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటలీ, రోమ్ సహా 16 నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోమ్‌లో ఉష్ణోగ్రతలు సోమవారం 40 డిగ్రీలకు మించి, మంగళవారం 43 డిగ్రీలకు చేరుకుంటాయి. ఆగస్టు 2007 తర్వాత ఇదే అత్యధికం.ఫ్రాన్స్‌లో కూడా హీట్‌వేవ్ దెబ్బకి జూన్‌లో ఒకసారి అల్లాడిపోయిన ప్రజలు ఇప్పుడు మళ్లీ అలాంటిదే జరుగుతుందని భయపడుతున్నారు. జపాన్‌లో కూడా వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతోంది. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, అలా జరిగితే మునుపటి రికార్డులు బద్దలవుతాయని అధికారులు తెలిపారు. పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Tags

Next Story