Birthright Citizenship Order: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు..

జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేస్ లా.. ఈ జన్మ హక్కు పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని ఇల్లినాయీ, ఓరేగాన్, వాషింగ్టన్, ఆరిజోనా రాష్ట్రాలు వినిపించిన తమ వాదనల ఆధారంగా అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ ఆదేశాలు ఇచ్చింది. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా యూఎస్ లో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఉండేది.
కానీ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టుల్లో 5 పిటిషన్లను దాఖలు చేశారు. అందులో ఒక పిల్ పై గురువారం ఫెడరల్ జడ్జి ఈ తీర్పు ఇవ్వగా.. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయమూర్తి వెల్లడించారు.14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com