PM Modi: మోదీ చేతుల మీదుగా నేడు UAE హిందూ ఆలయం ప్రారంభం!
రెండు రోజుల పర్యటనలో భాగంగా UAE రాజధాని అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాలు విస్తరణపై ఇరు నేతలు చర్చించుకున్నారు. ఈ సమావేశంలో UAE అధ్యక్షుడుతో కలిసి ప్రధాని మోదీ ఆ దేశంలో UPI రూపే కార్డు సేవలను ప్రారంభించారు. అబుదాబిలో నేడు హిందు దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని.. ముందుకు తీసుకెళ్లేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-UAE చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. మోదీ రాకతో దుబాయ్‌లోని ప్రముఖ కట్టడం బుర్జ్ ఖలిఫాపై భారత్ జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రధాని మోదీ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. UAE వెళ్లిన ప్రతిసారి తన కుటుంబం వద్దకు వచ్చి న భావన కలుగుతుందని... మోదీ అన్నారు. భారత్, UAE మధ్య ప్రతిరంగంలోనూ పరస్పర భాగస్వామ్యం ఉందని ఆ దేశ అధ్యక్షుడితో జరిగిన భేటీలో సంతోషం వ్యక్తం చేశారు. అగ్రనేతలిద్దరి సమక్షంలో మొత్తం 8ఒప్పందాల మార్పిడి జరిగాయి. ఇందులో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కీలకం. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాలు విస్తరణతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ భేటీలోనే UAE యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు.
అనంతరం అబుదాబి జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన "అహ్‌లాన్ మోదీ" కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వేలాదిమంది ప్రవాస భారతీయులతోస్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రవాసీయులు భారతీయ శైలి వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. UAE నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారన్న మోదీ140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలోని ప్రతిఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం భారత్- యూఏఈ దోస్తీ జిందాబాద్ అని నినదిస్తున్నట్లుమోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు.
అబుదాబిలో హిందు దేవాలయాన్ని నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. ఆ దేశ ప్రభుత్వం ఇచ్చిన 27ఎకరాల భూమిలో 2019లో నిర్మాణం చేపట్టగా రాజస్థాన్, గుజరాత్‌ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు మూడేళ్ల పాటు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్‌లో మరో మూడు హిందు దేవాలయాలున్నామోదీ ప్రారంభించే ఆలయం గల్ఫ్ దేశాల్లోనే అతి పెద్దది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com