Maldives: మాల్దీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది..

Maldives: మాల్దీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది..
బాధ్యతలు నిపుణుల బృందానికి..

మాల్దీవుల నుంచి తొలి విడతగా భారత బలగాలు వెనక్కి వచ్చినట్లు తెలిసింది. భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన సైనిక సిబ్బంది స్వదేశానికి పయనమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ MNDF తెలిపిందని స్థానిక మీడియా వెల్లడించింది. అడ్డూ నగరంలోని భారత సైనికులు.. ఆ దేశానికే చెందిన సాధారణ పౌరనిపుణుల బృందానికి హెలికాప్టర్‌ బాధ్యతలు అప్పగించారని పేర్కొంది.

అయితే భారత రక్షణ శాఖ దీనిని ధ్రువీకరించలేదు. మాల్దీవుల్లో మిగిలిన భారతీయ సైనికులు మే 10 నాటికి తిరిగి భారత్‌కు వెళ్లిపోతారని ఎంఎన్‌డీఎఫ్‌ ప్రతినిధి చెప్పినట్లు మాల్దీవుల మీడియా తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. భారత దేశానికి చెందిన సైనికులు కానీ, సాధారణ అధికారులు కానీ మే 10 తర్వాత మాల్దీవుల్లో ఉండరన్నారు. గత కొద్ది నెలలుగా మాల్దీవులు, చైనా దగ్గరైనట్లు కనిపిస్తున్నాయి.మే నెల నాటికి తమ భూభాగంపై ఉన్న 80 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌ను కోరారు. ముయిజ్జు తీసుకున్న ఈ నిర్ణయం చైనా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఉంది. మాల్దీవుల నుంచి విడతలవారీగా భారత బలగాల ఉపసంహరణ జరగనుంది. ఎన్నికల ప్రచారం నాటి నుంచే ముయిజ్జు మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి పంపించే విషయంలో దూకుడుగా ఉన్నారు. మే 10వ తేదీ తర్వాత యూనిఫాంలో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ ఒక్క భారత సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల చెప్పారు.

మాల్దీవుల్లో భారత సైనికులు ఏం చేసేవారు?

మాల్దీవులకు సాయంగా అందజేసిన హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసం సైనికులు అక్కడ ఉన్నారని భారత్ చెబుతోంది. ఈ హెలికాప్టర్లను భారత్ కొన్నేళ్ల కిందట మాల్దీవులకు అందజేసింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్‌కు మాల్దీవులు చాలా కీలకం. ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై పట్టు సాధ్యమవుతుంది. అయితే, ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. భారత్ - మాల్దీవుల సంబంధాల్లో నెలకొన్న సమస్యలను, తనకు అనుకూలంగా మలుచుకుని ఆ ప్రాంతంలో పట్టు పెంచుకోవాలని చైనా భావిస్తోంది. సైనికులకు బదులు సాంకేతిక సిబ్బందిని నియమించేలా భారత్, మాల్దీవులు అంగీకరించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అందులో భాగంగా, సాంకేతిక బృందం మాల్దీవులకు చేరింది. అనంతరం ముయిజ్జు నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

Tags

Read MoreRead Less
Next Story