Alexei Navalny: అలెక్సీ నావల్నీ మృతికి రష్యా విషప్రయోగమే కారణం..

రెండేళ్ల కిందట రష్యా ప్రతిపక్ష నేత అలెక్నీ నావల్నీ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై యూరోపియన్ దేశాలు సంచలన ప్రకటన చేశాయి. నావల్నీ మృతికి విషప్రయోగమే కారణమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ సహా ఐదు ఐరోపా దేశాలు ఆరోపించాయి. పుతిన్‌ను గట్టిగా విమర్శించే నావల్నీపై రష్యా అధ్యక్ష కార్యాలయం విషప్రయోగం చేసినట్టు ఐదు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆయన నుంచి సేకరించిన నమూనాల్లో దక్షిణ అమెరికాలోని విషపూరిత డార్ట్ కప్పల్లో ఉండే ‘ఎపిబాటిడిన్’ అనే విష పదార్థం ఉనికి గుర్తించామని,. సహజంగా ఇది రష్యాలో ఉండదని పేర్కొన్నారు. నావల్నీని తమకు ముప్పుగా రష్యా ప్రభుత్వం చూసిందని, ఆయనకు భయపడిందని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది.
జైల్లో ఉన్న ఆయనపై విష ప్రయోగానికి పాల్పడే ఉద్దేశం, అవకాశం కేవలం మాస్కో ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆరోపణలు చేశారు. రసాయన ఆయుధాల ఒప్పందానికి తూట్లు పొడిచిన రష్యాపై సంబంధిత అంతర్జాతీయ సంస్థకు ఫిర్యాదు చేస్తున్నట్లు యూకే విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పేర్కొన్నారు.‘నావల్నీ రష్యా ముప్పుగా చూసింది.. విషప్రయోగం ద్వారా రష్యా ప్రభుత్వం నీచమైన పనికి ఒడిగట్టింది.. రాజకీయ వ్యతిరేకత పట్ల తనకున్న అధిక భయాన్ని ప్రదర్శించింది’ అని ఆయన ఆరోపించారు.
ఇక, నావల్నీ భార్య యులియా మాట్లాడుతూ.. జైలులో తన భర్తది ముమ్మూటికీ హత్యేనని, ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైందని అన్నారు. మ్యూనిచ్ భద్రతా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘రెండేళ్ల కిందట నేను ఇదే వేదికపైకి వచ్చి నా భర్తను చంపింది వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పాను.. ఇది హత్య అని నాకు ఖచ్చితంగా తెలుసు... కానీ అప్పట్లో అది కేవలం ఆరోపణలు మాత్రమే. కానీ నేడు అవి శాస్త్రీయ నిరూపితమై వాస్తవాలు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన అలెక్సీ నావల్నీ.. ప్రభుత్వంలో అవినీతిపై పోరాటం చేశారు. దీంతో ఆయన రాజకీయ కక్షతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ కేసులు పెట్టి, 19 ఏళ్లు జైలు శిక్ష విధించారు. జైల్లో ఉన్నప్పుడే 2024 ఫిబ్రవరిలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రష్యా అధికారులు ఆయన అరోగ్యం వల్లే చనిపోయారని ప్రకటించారు. దీనికి ముందు 2020లోనూ తనపై విషప్రయోగం జరిగినట్టు నావల్నీ ఆరోపించారు. చికిత్స కోసం జర్మనీకి వెళ్లి ఐదు నెలల్లోనే రష్యాకు తిరిగొచ్చారు. ఆ సమయంలోనే అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
