China Floods: చైనాను ముంచెత్తిన వరదలు..

47 మంది మృతి

చైనాను మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా దక్షిణ చైనాలో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల భారీగా చెట్లు నేలకూలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.

గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొంది. ఈ జల విలయంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు చైనా మీడియా వెల్లడించింది.

దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో శిథిలాల కింద ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఏప్రిల్‌లోనే చైనాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదల హెచ్చరిక జారీ చేసింది. ఆ సమయంలో కూడా చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరదలు లక్షల ఇళ్లను ముంచేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చైనాలో వరదల సీజన్ ముందుగానే ప్రారంభమైందని సమాచారం.

Tags

Next Story