Pakistan: అఫ్గానీయులు బలవంతంగా వెళ్లగొడుతున్న పాక్

Pakistan: అఫ్గానీయులు బలవంతంగా వెళ్లగొడుతున్న  పాక్
X
మార్గ మధ్యలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు

అక్రమంగా ప్రవేశించిన అఫ్గానిస్తాన్‌ పౌరులను తమ దేశం నుంచి పాకిస్తాన్‌ వెళ్లగొడుతోంది. పాకిస్తాన్‌ను వీడాలని అక్కడి అధికారులు హెచ్చరించిన వేళ...ఇప్పటికే లక్షా 74 వేల మందికిపైగా అఫ్గాన్‌ వాసులు స్వదేశానికి తరలివెళ్లారు. మార్గ మధ్యలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అఫ్గాన్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్‌ 17 నుంచి ఇప్పటి వరకూ లక్షా 74 వేల మందికిపైగా అఫ్గాన్‌ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లినట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. అన్‌ రిజిస్టర్డ్‌ విదేశీ పౌరులంతా నవంబర్‌ 1 లోపు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితమే పాక్‌ అల్టిమేటం జారీ చేసింది. అలా వెళ్లని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాక్‌ అల్టిమేటం నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఉన్న అక్రమ వలసదారులు అఫ్గాన్‌ సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్నారు. పాక్‌ను వీడి అఫ్గానిస్తాన్‌ వెళ్తున్నారు.

వీరితో పాటు వివిధ జైళ్లలో ఉన్న చిన్న చిన్న నేరాలు చేసిన సుమారు 500 మంది అఫ్గాన్‌ ఖైదీలను సైతం పాక్‌ ప్రభుత్వం వారి స్వదేశం పంపింది. వేల మంది అఫ్గాన్‌ ప్రజలు పాక్‌ నుంచి ఒక్కసారిగా వెళ్లడంతో దారిలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాగడానికి మంచి నీరు, సరైన ఆహారం అందక...ప్రజలు అల్లాడుతున్నారు. దారి పొడవునా ఉండటానికి వసతి లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ నిద్రించడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పిల్లలు దాహం, ఆకలితో అలమటిస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి కొంత మంది తమ చదువు పత్రాలన్ని పాక్‌లో ఉన్నాయని...వాటిని వదిలి అఫ్గాన్‌కు తిరిగి వెళ్లడంతో తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వెలిబుచ్చారు.


పాకిస్తాన్‌ను వీడేటప్పుడు విలువైన వస్తువులను మాత్రమే తమ వెంట తీసుకెళ్లడం వల్ల వారి వద్ద చలి నుంచి తప్పించుకోవడానికి సరైన దుస్తులు, వస్తువులు లేకుండా పోయాయి. కేవలం చిన్న మంటను రాజేసుకుని దాని పైనే ఆధారపడుతున్నామని చలి తీవ్రతకు చిన్న పిల్లలు జబ్బు పడుతున్నారని అఫ్గాన్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతుల లేక బహిరంగంగా మలమూత్ర విసర్జణ చేయడంతో పరిసరాలన్ని అపరిశుభ్రంగా మారి అనారోగ్యానికి నెలవుగా తయారవుతున్నాయని వారు తెలిపారు. తమ పిల్లలు ఆహారం తినడానికి, తాగడానికి సరైన సదుపాయం లేక ప్లాస్టిక్‌ బాటిల్‌ను ముక్కలుగా చేసి దాని ద్వారా నీళ్లను తాగుతున్నట్లు అక్కడి వారు చెప్పడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది

Tags

Next Story