Miss Brazil Gleycy Correia: 27 ఏళ్ల మాజీ మిస్ బ్రెజిల్.. టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి మృతి

Miss Brazil Gleycy Correia: మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా తన 27 సంవత్సరాల వయస్సులో మృతి చెందింది. ఆమె టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఒక సాధారణ ఆపరేషన్ చేయించుకుంది. దాని తర్వాత ఆమెకు మెదడులో రక్త స్రావం అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె గుండెపోటుకు గురై మరణించింది.
బ్రెజిల్ మీడియా ప్రకారం.. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని గెలుచుకున్న కొరియా సోమవారం ఒక ప్రైవేట్ క్లినిక్‌లో మరణించారు. గత రెండు నెలలుగా ఆమె కోమాలో ఉన్నారు. ఆమె టాన్సిల్స్‌ను తొలగించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అయిన కొన్ని రోజుల తరువాత ఆమెకు భారీ రక్తస్రావం జరిగింది. ఏప్రిల్ 4 న గుండెపోటు కూడా వచ్చింది. దాని తరువాత రెండు నెలలు కోమాలోనే ఉండిపోయి చివరు సోమవారం తుది శ్వాస విడిచింది.
గ్లేసీ కొరియా ఒక మోడల్, బ్యూటీషియన్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 56,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఆమె బ్రెజిల్‌లోని అట్లాంటిక్ తీరంలో రియో డి జనీరోకు ఈశాన్యంగా 120 మైళ్ల దూరంలో ఉన్న మాకే అనే నగరంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుండి పని చేసింది. ఇంటికి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్లో మానిక్యూరిస్ట్‌గా ఉద్యోగం సంపాదించింది.
సోషల్ మీడియా పేజీలో ఆమె చేసిన చివరి పోస్ట్ తన కుటుంబసభ్యులను, స్నేహితులను కలిచివేసింది. "నేను బ్రతకడానికి పోరాటం చేసాను, నా రేసు పూర్తయింది. నేను విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను" అనే క్యాప్షన్‌తో, నవ్వుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇది కోమాలోకి వెళ్లకు ముందు చేసిన పోస్ట్ అని కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com