Gyanendra Shah: నేపాల్ మాజీ రాజుకు రూ.7,90,000 జరిమానా!

నేపాల్‌లో రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆ ఘర్షణల్లో ప్రజా ఆస్తులు ధ్వంసమైన ఘటనకు సంబంధించి మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు జరిమానా విధించడం జరిగింది. జరిమానాకు సంబంధించిన నోటీసులను కాఠ్‌మాండూ మేయర్ పంపించారు.
నేపాల్‌లో దాదాపు రెండున్నర శతాబ్దాల రాచరిక పాలన 2008లో అంతమై, ప్రజాస్వామ్య పాలన ఆరంభమైంది. అయినప్పటికీ రాజకీయ అస్థిరతతో అనేక ప్రభుత్వాలు మారాయి. వీటిపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ రాజు జ్ఞానేంద్ర షా తనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అప్పటి నుంచి రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మాజీ రాజు జ్ఞానేంద్ర షా పిలుపు మేరకు ఆయన మద్దతుదారులు కాఠ్‌మాండూలో నిరసనలు చేపట్టారు. ఇవి హింసాత్మకంగా మారాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి కారణమయ్యాయి. ఈ హింసలో ఇద్దరు మృతి చెందగా, 110 మందికి పైగా గాయపడ్డారు.
వీటికి జ్ఞానేంద్ర కారణమని కాఠ్‌మాండూ నగర మేయర్ బాలేంద్ర షా పేర్కొంటూ, మాజీ రాజు 7,93,000 నేపాలీ రూపాయలను పరిహారంగా చెల్లించాలని తెలిపారు. ఈ మేరకు మహారాజ్‌గంజ్‌లో ఉన్న మాజీ రాజు నివాసం 'నిర్మలా నివాస్'కు నోటీసులు పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com