Imran Khan: నేరపూరిత కుట్ర అభియోగం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈసారి పెద్ద చిక్కులోనే పడ్డారు. రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో ఇమ్రాన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. దీంతో జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గండిపడినట్లయ్యింది. వాస్తవానికి కోర్టులో విచారణ జరుగాల్సి ఉండగా.. భద్రతా కారణాల నేపథ్యంలో అటాక్ జైలులోనే విచారణ జరిపేందుకు ఈ నెల 15న పాక్ న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కోర్టులో విచారించకుండా జైలులో విచారించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారం తీర్పును రిజర్వ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ ఆదేశించారు. ఇదే కేసులో ఇమ్రాన్ సన్నిహితుడు, విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషీ సైతం కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీని సైతం ఈ నెల 26 పొడిగించింది. ఈ సమాచారాన్ని పీటీఆర్ పార్టీ ఒక సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
గతేడాది మార్చిలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరిగాయి. ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ తన జేబులో నుంచి ఓ పత్రాన్ని తీసి చూపిస్తూ.. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ జరిగిందంటూ ఆరోపించారు. అయితే, ర్యాలీలో తాను చూపిందని రహస్య పత్రం అంటూ వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ పేపర్‌ను ఎక్కడో పోయిందని.. ఎక్కడ పెట్టానో గుర్తు లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు.
ఇక ఇప్పుడు మే 9న జరిగిన హింసకు సంబంధించి ఆయనపై ‘నేరపూరిత కుట్ర’ అభియోగం నమోదైంది. దీంట్లో ఆయన దోషిగా తేలితే గరిష్ఠంగా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. రావల్పిండిలోని మిలటరీ హెడ్‌క్వార్టర్స్, స్థావరాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు. కొన్నింటిని తగలబెట్టేశారు. 100కుపైగా పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.
ఆర్మీ స్థావరాలపై దాడులకు సూత్రధారిగా వ్యవహరించడం, హింసకు ప్రజలను ప్రేరేపించడం వంటి అభియోగాలపై ఇమ్రాన్‌పై తాజాగా అభియోగాలు నమోదైనట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. లాహోర్ పోలీస్ సీనియర్ దర్యాప్తు అధికారి అనూస్ మసూద్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ఖాన్, ఆయన పార్టీ పీటీఐ నాయకులు, కార్యకర్తలపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదైనట్టు చెప్పారు. ఆయనపై నమోదైన ఈ అభియోగాలు కనుక తేలితే గరిష్ఠంగా మరణశిక్ష ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com