Donald Trump: దయచేసి నన్ను పోటీ చేయనివ్వండి ...

యూఎస్ అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టుతోపాటు మైన్ రాష్ట్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొలరాడో కోర్టు తీర్పును యూఎస్ సుప్రీం కోర్టును ట్రంప్ అభ్యర్థించారు. గతేడాది డిసెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
తాజాగా దానిని రద్దుచేయాలని కోరుతూ మంగళవారం యూఎస్ సుప్రీం కోర్టులో ట్రంప్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలుచేయానికి అనుమతించినట్లయితే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుందని, ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు.
కాగా, కొలరాడో కోర్టు తీర్పు వెలువరించి పట్టుమని 10 రోజులైనా గడవకముందే మైన్ రాష్ట్రం కూడా ఆయనకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ట్రంప్ అనర్హుడని స్పష్టం చేసింది. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాలు చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెన్నా బెల్లోస్.. ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్టు గతవారం ప్రకటించారు.
తద్వారా అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న అభ్యర్థిపై ఏకపక్షంగా వేటువేసిన తొలి అధికారిగా ఆమె రికార్డులకు ఎక్కారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ చేసుకున్న అప్పీలుపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు అమెరికా సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరిగింది. అయితే, దీనిపై ట్రంప్ కోర్టును ఆశ్రయించేందుకు బెల్లోస్ అవకాశం కల్పించారు. అప్పటివరకు తన నిర్ణయం అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బెల్లోస్ నిర్ణయాన్ని మైన్ కోర్టులో సవాలు చేయనున్నట్టు ట్రంప్ మద్దతుదారులు తెలిపారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడికి దిగిన విషయం విదితమే. వారిని సమర్ధించి, హింసను ప్రేరేపించినట్టు ట్రంప్‌పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com