NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు..

NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు..
X
NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు..

వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం నింగిలోకి పయనమైంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్‌ ద్వారా వారు రోదసిలోకి బయల్దేరారు. వీరిలో అమెరికాకు చెందిన జెస్సికా మెయిర్, జాక్‌ హాథవే, ఫ్రాన్స్‌ వ్యోమగామి సోఫీ ఆడెనాట్, రష్యాకు చెందిన ఆండ్రెయ్‌ ఫెద్యయేవ్‌లు ఉన్నారు. వీరు శనివారం ఐఎస్‌ఎస్‌ చేరుకుంటారు. 8-9 నెలల పాటు అక్కడే విధులు నిర్వర్తిస్తారు. వ్యోమగాములు కక్ష్యలోకి చేరగానే.. ‘‘ఈ రోజు శుక్రవారం.. 13వ తేదీ. చాలా మంచి రోజు’’ అని స్పేస్‌ఎక్స్‌కు చెందిన లాంచ్‌ కంట్రోల్‌ సందేశం పంపింది.

దీనికి కమాండర్‌ జెస్సికా స్పందిస్తూ.. ‘‘ఇది అద్భుత ప్రయాణం’’ అని బదులిచ్చారు. ఐఎస్‌ఎస్‌లో ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. గత నెలలో ఒక వ్యోమగామికి అనారోగ్య సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆస్ట్రోనాట్‌తోపాటు మరో ముగ్గురు సహచరులను అత్యవసరంగా భూమికి రప్పించారు. అనారోగ్యంపాలైన వ్యోమగామి ఎవరన్నది అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వెల్లడించలేదు. పుడమికి చేరాక నలుగురు ఆస్ట్రోనాట్‌లను నేరుగా ఆసుపత్రికి తరలించారు. 65 ఏళ్ల నాసా మానవసహిత అంతరిక్ష యాత్రల చరిత్రలో వైద్య కారణాలతో మిషన్‌ను కుదించాల్సి రావడం అదే మొదటిసారి. తాజా యాత్ర నేపథ్యంలో వ్యోమగాములకు సంబంధించిన వైద్య ప్రక్రియలను సంస్థ సమీక్షించింది. ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలతో సంతృప్తి చెందింది. వ్యోమగాములు బయల్దేరడానికి ముందు ఎలాంటి అదనపు వైద్యపరీక్షలు నిర్వహించలేదు. అలాగే కొత్త వ్యాధి నిర్ధారణ పరికరాలనూ పంపలేదు. ఐఎస్‌ఎస్‌లో ఇప్పటికే ఒక అల్ట్రాసౌండ్‌ యంత్రం ఉంది. గత నెలలో అనారోగ్యంపాలైన వ్యోమగామిని దాని సాయంతోనే పరీక్షించారు.

Tags

Next Story