US Shooting : చర్చిలో కాల్పులు జరిపి నిప్పు, అమెరికాలో కలకలం

US Shooting : చర్చిలో కాల్పులు జరిపి నిప్పు, అమెరికాలో కలకలం
X
రెండు ఘటనల్లో నలుగురి మృతి

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిషిగన్‌లోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆదివారం మిషిగన్‌ రాష్ట్రంలోని గ్రాండ్‌ బ్లాంక్‌లోని మోర్మాన్‌ చర్చిని కారుతో ఢీకొట్టిన దుండగుడు, కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నిప్పుపెట్టాడు. చర్చి మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఎనమిది మంది గాయపడ్డారని, నిందితుడు హతమయ్యాడని పోలీసులు చెప్పారు.

నిందితుడిని థామస్‌ జాకబ్‌ స్యాన్‌ఫోర్డ్‌ (40)గా గుర్తించామని, అతడు గతంలో యూఎస్‌ మెరైన్‌లో పనిచేశాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై పోలీసులు స్పష్టత నివ్వడం లేదు. కాగా, ఈ ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. దేశంలోని క్రిస్టియాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

నార్త్‌ కరోలినాలోనూ..

ఉత్తర కరోలినాలోని అమెరికన్‌ ఫిష్‌ కంపెనీ రెస్టారెంట్‌ సమీపంలో శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. గుర్తు తెలియని ఓ బోటు నార్త్‌ కరోలినాలోని సౌత్‌పోర్ట్‌ యాట్‌ బేసిన్‌లో ఉన్న అమెరికన్‌ ఫిష్‌ కంపెనీ రెస్టారెంట్‌ వద్దకు వచ్చింది. బోటులోని వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు అదే బోటులో పారిపోయాడు. మరోవైపు.. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags

Next Story