Philadelphia :అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. ఫిలడెల్ఫియాలో సోమవారం రాత్రి జరిగిన కాల్పులలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎక్కడికి వెళ్లాలన్నా చిన్న భయం.. గట్టిగా వెహికల్ హారన్ మోగించాలంటే భయం, ఎవరిదైనా తెలిసిన మొహంలా అనిపించి రెండోసారి చూడాలంటే భయం. ఒంటరిగా ఉంటే భయం.. కొంచెం గట్టిగా మాట్లాడాలంటే భయం. తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేసినా ఎవడికి కోపం వచ్చి గన్ను గురి పెట్టి కాల్చేస్తాడేమో అన్న భయం. క్రైమ్ యాక్షన్ సినిమాలో హీరో గన్‌ను వాడినట్లు ఎవరు ఎవరికి గురి పెడతారో భయం. ఎన్ని భయాలు ఉన్నా ఆదేశం అంటే ఎంతో ప్రేమ అదే అమెరికా.
అయితే గన్‌తో ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే అదే గన్‌తో ఇతరుల ప్రాణాలను తీయడం ఇక్కడ మోస్ట్ కామన్ థింగ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అయినా సరే అక్కడి పరిస్థితుల్లోకించిత్తు కూడా మార్పు లేదు. తాజాగా ఫిలడెల్ఫియాలో సోమవారం కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గన్ తో కింగ్‌సెసింగ్ విభాగంలో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతకు ముందు అమెరికాలోని బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో జరిగిన రెండు వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఉదయం సమయంలో బాల్టిమోర్ లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడగా ఇద్దరు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.
అలాగే కాన్సాస్ లో ని ఉత్తర వాషింగ్టన్ వీధిలోని సిటీ నైట్స్ నైట్ క్లబ్ లో కూడా రాత్రి ఒంటిగంటకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. భయంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పుల విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
హింసాత్మక నేరాలు ఇంతగా పెరిగిపోతుండడానికి తుపాకుల అమ్మకాలపై ఎలాంటి అడ్డు అదుపు లేకపోవడమే కారణమని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com