ఆ చిన్నారులు అజేయులు

అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు

అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పిపోయిన చిన్నారులు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. ఒకటి రెండు కాదు ఏకంగా 40 రోజుల సుధీర్ఘ గాలింపు చర్యల తరువాత పిల్లలు సజీవంగా దొరకటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అమెజాన్ అటవీ మార్గంలో ప్రయాణిస్తున్నా ఒక చిన్న విమానం మే 1వ తేదీన ప్రమాదవశాత్తు దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది. ఏడుగురు ప్రయాణికులు ఉన్న ఈ విమానంలో ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంజన్లో వైఫల్యం ఏర్పడినట్టు పైలెట్ ప్రకటించారు. అయితే అది వెంటనే కూలిపోవడంతో పైలెట్, పిల్లల తల్లి, మరొక బంధువు అక్కడికక్కడే మరణించారు. నలుగురు పిల్లల ఆచూకీ తెలియకుండా పోయింది. విషయం తెలుసుకున్న కొలంబియా బృందం ఆపరేషన్ హోప్ పేరిట పిల్లలను వెతకడానికి రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది.

ప్రమాదం జరిగిన రెండు వారాల తరువాత అంటే మే 16న ఒక బృందం అమెజాన్ అరణ్యంలో విమాన శకలాలు కనుగొంది. తీరా అక్కడికి చేరుకున్నాక అన్నీ మృతదేహాలే తప్ప పిల్లలు కనిపించకపోవడంతో రెస్క్యూటీమ్ మరోసారి వెతుకులాట ప్రారంభించింది. పిల్లలు 13, 9, 4 సంవత్సరాల వారు కాగా ఒకరి వయసు 11 నెలలు మాత్రమే. ఈ పిల్లలను గురించి తెలుసుకోవడానికి స్నిఫర్ డాగ్స్, సుమారు 150 మంది సైనికులు, పదుల సంఖ్యలో వాలంటీర్లు నిరంతరం గాలిస్తూనే ఉన్నారు. మొత్తం కొలంబియా వాసులంతా వీరి కోసం ప్రార్థించారు. చివరకు ప్రజల ప్రార్థనలు ఫలించాయి.

40 రోజుల తర్వాత ఆ పిల్లలు నలుగురూ దొరికారని, వారంతా క్షేమంగా ఉన్నారని కొలంబియా ప్రెసిడెంట్ ప్రకటించారు. వందలాదిమంది సైనికులతో చేపట్టిన ఆపరేషన్ హోప్ ముగిసిందని సైనికులతో పాటు పిల్లలను వెతికేందుకు స్వచ్ఛందంగా అడవుల్లోకి వెళ్లిన వారికి ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన పిల్లల ఫోటోని ట్వీట్ చేశారు. చిన్నారులకు వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్ని రోజులు తర్వాత చిన్నారులు అజేయులుగా బయటకు వచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలను రక్షించేందుకు నేషనల్ లిబరేషన్ ఆర్మీ, రెబల్ గ్రూపు ప్రతినిధులు కాల్పుల విరమణ ఒప్పందం పై సంతకాలు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంఘటన కొలంబియా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

Tags

Next Story