ఇస్లామిజాన్ని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ చర్యలు షురూ

విపరీతంగా పెరిగిపోతున్న ఇస్లామిజాన్ని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ చర్యలు షురూ చేసింది.. మత హింసకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశం కొత్త బిల్లును తీసుకొచ్చింది.. దీనికి సంబంధించిన బిల్లు ఫ్రాన్స్ పార్లమెంటు దిగువ సభలో ఆమోదం పొందింది. 347 మంది సభ్యులు ఆ బిల్లుకు అనుకూలంగా, 151 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మరో 65 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.. దిగువ సభలో భారీ మెజారిటీతో బిల్ పాస్ కాగా.. ఎగువ సభకు వెళ్లనుంది.
ఫ్రాన్స్‌లో ముస్లింల జనాభా సుమారు 50 లక్షలు. మెజార్టీ కుటుంబాలు అల్జిరియా మూలాలకు చెందినవే. మరోవైపు ఇస్లామిక్ మిలిటెంట్ దాడులతో ఆ దేశం సతమతం అవుతోంది. మత తీవ్రవాదం, దేశ భద్రత, ఫ్రెంచ్ గుర్తింపు వంటి సమస్యలు కూడా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దేశం నుంచి మతాన్ని వేరే చేసే బిల్లును తీసుకొచ్చింది అధికార పార్టీ. ఇది దేశ ఐక్యతకు ముప్పని మాత్రమే బిల్లులో పేర్కొనగా.. ఏ మతం గురించీ ప్రస్తావించలేదు. అయితే, బలవంతపు వివాహాలు, కన్యత్వ పరీక్షలపై నియంత్రణ, పిల్లలకు వేరుగా విద్యా భోదనపై ఆంక్షలు, హింసకు తావిచ్చే ఆన్‌లైన్ క్షమామణలపై కఠిన చర్యలు, మత సంఘాలపై పటిష్ట నిఘా వంటివి ఈ బిల్లులో పేర్కొన్నారు.
ఇస్లాం వేర్పాటు వాదంపై పోరు, లౌకికత్వ సంరక్షణల కోసం సరికొత్త చట్టం తీసుకొస్తానని అధ్యక్షుడు మేక్రాన్ గతంలోనే ప్రకటించారు. మతాల స్థానంలో లౌకిక వాదానికి పట్టం కడుతూ 1905లో తీసుకొచ్చిన కీలక చట్టాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందన్నారు. కొత్త చట్టం ఇస్లామిక్ వేర్పాటు వాదాన్ని సాగనివ్వబోదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు.. ఐదేళ్ల క్రితం జరిగిన చార్లీ హెబ్డో ఘటన.. గత ఏడాది అక్టోబరులో స్కూల్ టీచర్ శామ్యూల్ పాటీ హత్య ఘటనల నేపథ్యంలో ఇస్లాం ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చారు.
అయితే కొద్ది మంది ఇస్లాంవాదుల స్వేచ్ఛను సవరించే ప్రయత్నంలో భాగంగానే అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్స్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి స్వేచ్ఛను పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అటు దిగువ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రతిపక్షాల ఆధిక్యమున్న సెనేట్‌కు చేరుతుంది. సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందితే మసీదులు, పాఠశాలలు, స్పోర్ట్స్ క్లబ్బుల్లో చట్ట వ్యతిరేక, తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూసే వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది. హింస, విద్వేషాలను రెచ్చగొట్టే బోధనలు చేసేవారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఈ బిల్లుపై ఫ్రాన్స్‌లోని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో టుది పోలీస్ స్టేట్ అంటూ ప్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు. దేశమంతా ఈ నిరసనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com