France: పదవి చేపట్టిన నెలలోపే ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా..

ఫ్రాన్స్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని నడిపించడంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఇటీవలే ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టి నెల రోజుకు కూడా కాకముందే అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ ఆకస్మిక పదవీ విరమణ ఫ్రాన్స్ రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తరపున ప్రకటన విడుదల చేస్తూ.. లెకోర్ను రాజీనామాను ఆమోదించినట్లు అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.
లెకోర్ను రాజీనామాకు చాలానే కారణాలు ఉన్నాయి. కానీ అందులో ప్రధానమైనది మాత్రం.. ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన విధానమే. కొత్తగా ఏర్పాటు చేసిన కేబినెట్‌పై దేశంలోని వివిధ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వంలోని మంత్రులకు ముఖ్య శాఖలను తిరిగి అప్పగించడం, విధానపరమైన మార్పులకు అవకాశం లేదనే సంకేతాన్ని ఇవ్వడం ప్రతిపక్షాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో లె మైర్‌ను రక్షణ మంత్రిత్వ శాఖకు తీసుకురావాలనే లెకోర్ను నిర్ణయాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆర్థిక మంత్రిగా పని చేసిన లె మైర్ ఫ్రాన్స్ రుణభారం పెరగడానికి కారణమయ్యారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. ఆయనకు కీలకమైన రక్షణ శాఖను అప్పగించడంపై వ్యతిరేకత పెరిగింది.
అలాగే గతంలో మాదిరిగానే బ్రూనో రెటైల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. అదేవిధంగా జీన్ నోయెల్ బారోట్ విదేశాంగ మంత్రిగా, గెరాల్డ్ దర్మానిన్ న్యాయ శాఖ మంత్రిగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లెకోర్ను మంత్రివర్గం కేవలం కొద్ది మంది కొత్త సభ్యులతో, ఎక్కువగా పాత మంత్రులతో కూడి ఉండటం వలన ఆయన నిజంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారనే నమ్మకం రాజకీయ వర్గాలలో సన్నగిల్లింది. మరోవైపు జాతీయ అసెంబ్లీలో లోతైన చీలికలు ఉన్న నేపథ్యంలో.. లెకోర్ను ముందు బడ్జెట్‌ను ఆమోదింపజేయడం ఒక పెద్ద సవాలుగా మారింది.
గత ప్రభుత్వాలు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో పూర్తి ఓటింగ్ లేకుండా బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రత్యేక రాజ్యాంగ అధికారాన్ని (ఆర్టికల్ 49.3) ఉపయోగించేవి. కానీ ఈ అధికారాన్ని ఉపయోగించకుండానే ఎడమపక్షం, కుడిపక్షం వంటి అన్ని వర్గాల చట్టసభ సభ్యులతో సమస్యల పరిష్కారం కోసం రాజీ కుదుర్చుకుంటానని లెకోర్ను ప్రకటించారు. అయితే ఆయన మంత్రివర్గ కూర్పు, రాజీకి బదులు యథాస్థితిని ప్రతిబింబిస్తోందని విమర్శలు రావడం, మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మిత్రపక్షాలు సైతం వెనక్కి తగ్గడానికి కారణమైంది. ఫలితంగా ఆయన ప్రభుత్వం వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది. ఈ రాజకీయ ప్రతిష్టంభనను గుర్తించిన లెకోర్ను.. తన మంత్రివర్గం శాసనసభలో ఆమోదం పొందడం అసాధ్యమని గ్రహించి తొలి కేబినెట్ సమావేశానికి ముందే తన రాజీనామాను సమర్పించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com