France Unrest: ఫ్రాన్స్ లో ఏం జరుగుతోందంటే

France Unrest: ఫ్రాన్స్ లో ఏం జరుగుతోందంటే
ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్


ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంతో పోలీసుల కాల్పుల ఘటనలో 17 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత ఫ్రాన్స్‌ అల్లకల్లోలంగా మారింది. ఆందోళనలు కొనసాగుతుండగా, పోలీసులు వారిని అదుపులో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.





మంగళవారం తెల్లవారుజామున ట్రాఫిక్ చెకింగ్ సమయంలో 17 ఏళ్ల అల్జీరియన్ మొరాకో సంతతికి చెందిన నహేల్ అనే యువకుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. దీంతో పెద్దఎత్తున పౌరులు విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలను తగులబెడుతూ రెచ్చిపోతున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ అడ్డుకుంటున్న వారిపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో భారీగా బలగాలను మోహరించి, అల్లర్లు అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క పారిస్ నగరంలోనే 45 వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. తదుపరి కొన్ని గంటలు చాలా కీలకమని, అప్రమత్తంగా ఉండాలని బలగాలకు సూచించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ వెయ్యి మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.






కొన్ని దగ్గర్ల దుకాణాలను లూటీ చేశారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం బస్సు, రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. పలు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయడానికి యువతను ఇంటి దగ్గరే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులకు సూచించారు.

అయితే ఇదంతా ఓ పక్క జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పై మరోసారి జనం విరుచుకు పడ్డారు. ఆందోళనలతో దేశమంతా అట్టుడుకుతుంటే ఈయన మాత్రం ఒక మ్యూజిక్ కన్సర్ట్‌ పాల్గొన్నారంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టాన్‌ జాన్‌ కన్సర్ట్‌కు మేక్రాన్‌, ఆయన భార్య హాజరయ్యారు. భార్యతో కలిసి డాన్స్ కూడా చేశారు. ఆ వీడియోలను చూసి నెటిజన్లు మేక్రాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.






ఆందోళనకారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. మేక్రాన్‌ మాత్రం హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారని మండి పడుతున్నారు. అయితే .నిజానికి ఆ ఈవెంట్‌ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు మొదలైనా.. అంత ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story