France riot: రావణకాష్టంలా ఫ్రాన్స్‌

France riot: రావణకాష్టంలా ఫ్రాన్స్‌
అయిదో రోజూ అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్‌... ఆందోళనలు, లూటిలతో ఉద్రిక్తత... తుపాకుల దుకాణంలో ఆయుధాలు చోరీ... ఇప్పటివరకూ 2, 800 మంది అరెస్ట్‌

అయిదు రోజులుగా ఆందోళనకారులు పాల్పడుతున్న హింసకు ఫ్రాన్స్‌ మౌనసాక్షిగా నిలుస్తోంది. నహేల్‌ అనే పదిహేడేళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపడంతో మొదలైన నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు, లూటీలు, అల్లర్లతో ఫ్రాన్స్‌ నగరాలు అట్టుడుకుతున్నాయి. పారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా పలు నగరాల్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు ఐదో రోజూ వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పది షాపింగ్‌ మాళ్లు, వందల సూపర్‌ మార్కెట్లపై అల్లరి మూకలు దాడి చేసి లూటి చేశాయి. నిరసనకారులు కొందరు గుంపులుగా వచ్చి దుకాణాలను లూటీ చేశారు. మార్సెయిల్‌లో ఓ తుపాకుల దుకాణంలోకి చొరబడిన అల్లరిమూకలు ఆయుధాలు ఎత్తుకెళ్లారు. వందల సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. శాంతిని నెలకొల్పేందుకు 45 వేల మందికిపైగా పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 2,800 మందిని అరెస్టు చేశారు.


ఫ్రాన్స్‌ ప్రధాన నగరాలైన పారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా పలు ప్రాంతాల్లో ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనకారులు కనిపించిన కార్లు, భవనాలను తగులబెడుతున్నారు. 2, 500 ప్రాంతాల్లో అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల సాయంతో యువకులు నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా యువతే ఉన్నట్లు అధికారులు తెలిపారు. హింసాకాండకు సోషల్‌ మీడియానే ఆజ్యం పోస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ ఆరోపించారు. పోలీసుల భద్రత కారణంగా నిరసనలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు.

చైనీయుల విహారయాత్ర బృందంతో వెళుతున్న బస్సును ఆందోళనకారులు చుట్టుముట్టారు.బస్సు కిటికీలను ధ్వంసం చేశారు.దీంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన మార్సెయిల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఫ్రాన్స్‌కు ఫిర్యాదు చేసింది. చైనా పౌరులు, వారి ఆస్తుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఫ్రాన్స్‌దేనని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఉన్న చైనా పౌరులు లేదా ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకునే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.


ఉత్తర పారిస్‌ పరిసరాల్లో నిరసనకారులు బాణసంచా కాలుస్తూ బారికేడ్‌లను తగులబెట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలు, స్టన్ గ్రెనేడ్‌లతో ఎదురు కాల్పులు జరిపారు. దక్షిణ పారిస్ శివారు ఎల్ హై-లెస్-రోజెస్ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంటిని నిప్పంటించిన కారుతో ఆందోళనకారులు ఢీకొట్టారు. దాడిలో మేయర్‌ భార్య, పిల్లలలో ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌ నగరాలు వచ్చే ఏడాది ఒలింపిక్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో హింస చెలరేగడాన్ని ఒలింపిక్‌ నిర్వాహకులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నహేల్‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు. తన బిడ్డను పోలీసు అధికారి అన్యాయంగా చంపేశారని నహేల్‌ తల్లి కన్నీరు పెట్టుకున్నారు.

Tags

Next Story