జమ్మూ కాశ్మీర్‌లో నేటి నుంచి జీ20 భేటీ

జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ్టి నుంచి జీ20 భేటీ జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి కనీసం 60 మంది విదేశీ ప్రతినిధులు, 20 మంది పాత్రికేయులు సదస్సు కోసం ఇక్కడికి రానున్నారు. స్థానిక షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జీ-20 పర్యాటక వర్కింగ్ గ్రూపు మూడో భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జీ20 సమావేశం నేపథ్యంలో ఎన్‌ఐఏ అప్రమత్తం అయ్యింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సపోర్టు చేస్తున్న వారిపై దృష్టిపెట్టింది. తనిఖీల్లో భాగంగా జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన కార్యకర్తను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. సైనికులు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని కమాండర్‌కు చేరవేస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. జీ20 సమావేశం దృష్ట్యా జమ్మూకశ్మీర్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులోనూ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సమావేశం మే 24 వరకు కొనసాగనుంది. చీనాబ్ నది వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన స్పెషల్ ఫోర్స్ వింగ్.. ప్రత్యేక పడవలతో పెట్రోలింగ్‌ను పెంచిందని అధికారులు తెలిపారు. ఈ పడవలు చీనాబ్ నదిలో నిరంతరం గస్తీ కాయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక.. నది వెంబడి సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిటీకి ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. రాత్రి, పగలు తేడా లేకుండా బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఫుట్ పెట్రోలింగ్, వాహనాల పెట్రోలింగ్ కూడా పెంచినట్టు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com