Gaza: గాజాకు మానవతా సహాయం.. బైడెన్ కీలక నిర్ణయం

Gaza: గాజాకు మానవతా సహాయం..  బైడెన్ కీలక నిర్ణయం
ఎయిర్‌డ్రాప్‌ల ద్వారా

గాజాలో ఆకలి కేకలు మిన్నంటడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల ద్వారా మానవతా సాయాన్ని గాజాలోని పలుప్రాంతాల్లో జారవిడుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. గాజాసిటీలో ట్రక్కుల వద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడంతో 100మందికి పైగా మృతి చెందటంతో...అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గాజాపై దాడులు మెుదలుపెట్టడానికి ముందే ఇజ్రాయెల్‌ ఆ దేశ సరిహద్దులను మూసివేసింది. పాలస్థీనియన్లకు బయట నుంచి ఏ సహాయమూ అందకుండా చేసింది. ఫలితంగా ఆహారం మొదలు ఇంధనం వరకు...ఆ దేశం కొరత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే గతనెల 29న గాజాసిటీలో ఆహార పదార్థాల కోసం పాలస్తీనియన్లు ఎగబడటంతో ఇజ్రాయెల్‌ కాల్పులు జరిపింది. ఈ సంఘటన యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో ఆకలితో అల్లాడుతున్న గాజా వాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమన్న ఆయన....అందుకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉందన్నారు. సముద్రమార్గాన పెద్ద మొత్తంలో సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఆహార పదార్థాలను సైనిక విమానాల ద్వారా జారవిడుస్తామని శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. ఆహార పంపిణీ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు.


విమానాల ద్వారా ఆహార పదార్థాలను అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. ఇప్పటికే విమానాల ద్వారా మానవతా సాయాన్ని అందిస్తున్న జోర్డాన్‌తోపాటు ఇతర దేశాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాని మెలోని సమక్షంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. భూతల మార్గంలో కూడా మానవతా సాయం కొనసాగుతుందని శ్వేతసౌధం జాతీయ భద్రత అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ... విమానాల ద్వారా చేసే పంపిణీ అందుకు అదనమని వివరించారు. పాలస్తీనా ప్రజలందరికీ మానవతాసాయం అందాలంటే గాజా-ఈజిప్ట్‌ సరిహద్దులోని రఫా చెక్‌పోస్టు తెరుచుకుంటేనే సాధ్యమని, లేదంటే ఈ చర్య అంత ప్రయోజనకరం కాకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story