Gaza : ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో గాజా కకావికలం

Gaza : ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో గాజా కకావికలం
అన్నపానీయాలకూ కొరత

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.విద్యుత్‌, ఆహారం, ఇంధన సరఫరా నిలిపివేసిన గాజాలో ఒక కాలనీ తర్వాత మరో కాలనీపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌జెట్లతో బాంబులు కురిపిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాలు స్మశానాన్ని తలపిస్తున్నాయి. కాంక్రీటు శిథిలాలతో నిండిపోయాయి. 22 వేలకుపైగా ఇళ్లు, ఆస్పత్రులు, 48 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 450 లక్ష్యాలను ఐడీఎఫ్‌ పేల్చివేసింది. గాజా షిప్పింగ్‌ పోర్టులోని ఫిషింగ్‌బోట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. పాలస్తీనా పౌరులంతా ప్రాణాలు అరచేత పట్టుకుని ఐరాస నిర్వహిస్తున్న షెల్టర్లకు పారిపోతున్నారు. గాజాకు ఇజ్రాయెల్‌ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం.. నగరంలో ఉన్న ఒకేఒక్క విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోవడంతో దాన్ని కూడా షట్‌డౌన్‌ చేసినట్లు పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌-- హరాకత్‌ అల్‌-ముక్వామా అల్‌-ఇస్లామియా(హమాస్‌) వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు.. చము రు నిల్వలు అయిపోవడంతో.. గాజా వ్యాప్తంగా అంధకారమలుముకుంది. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయని.. ఔషధాల కొరత ప్రారంభమైందని ‘డాక్టర్స్‌ విత్‌ఔట్‌ బౌండరీస్‌’ పేర్కొంది. విద్యుత్తు సరఫరా లేక, అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయని, ఆక్సిజన్‌ యంత్రాలు పనిచేయడం లేదని వెల్లడించింది.


అటు లెబనాన్‌, సిరియా నుంచి మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగారు. హెజ్‌బొల్లా గ్రూప్‌ ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ట్యాంకు విధ్వంసక క్షిపణులను ప్రయోగించింది.ప్రతిగా లెబనాన్‌ దక్షిణ ప్రాంతాలపై ఐడీఎఫ్‌ ప్రతిదాడులు చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌ నుంచి ఓ విమానం ఇజ్రాయెల్‌లోకి చొరబడినట్లు తెలిసింది. అయితే ఆ విమానం ఏంటో స్పష్టత రాలేదు. దీంతో పౌరులు బంకర్లకు వెళ్లాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు పాలస్తీనీయుల్లో నెలకొన్న నిస్పృహను తొలగిస్తామని మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ప్రకటించింది.


నాలుగు రోజుల యుద్ధంతో.. ఇజ్రాయెల్‌లోనూ ఆహార కొరత మొదలైంది. కూరగాయలు, ధాన్యం పంటలు ఎక్కువగా ఉన్న దక్షిణ ప్రాంతంలో పోరు భీకరంగా సాగుతోందని, పంట చేతికొచ్చినా.. కోతకు అవకాశాల్లేకుండా పోయాయని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఫుడ్‌చైన్‌ ఏర్పాటుకు హోల్‌సేలర్లు, రిటైలర్లకు ఆదేశాలు జారీ చేసింది. కబేళాలు, బేకరీలను నిరంతరాయంగా నడపాలని సూచించింది. కాగా, ఇజ్రాయెల్‌లో విపక్ష, అధికారపక్షాలతోకూడిన ఐక్య ప్రభుత్వం ఏర్పాటైందని.. వార్‌ క్యాబినెట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి.


Tags

Read MoreRead Less
Next Story