gaza : కడుపు నింపుతున్న కలుపు మొక్కలు

gaza : కడుపు నింపుతున్న కలుపు మొక్కలు
గాజాలో దారుణ పరిస్థితులు

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు కలుపు మొక్కలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నారు.

యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడంతో తినడానికి తిండి దొరకక గాజా పౌరులు కలుపు మొక్కలను తింటున్నారు. కఠినమైన పొడి నేలలో స్వేచ్ఛగా పెరిగే మాలో అనే మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. ఆ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని గాజా పౌరులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలోకి తగినంతగా సహాయక సామగ్రి రావడం లేదు. వేరే గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి గాజా పౌరులకు తలెత్తింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఉత్తర గాజా ఎటు చూసినా శిథిలాలమయంగా కనిపిస్తోంది. నీరు, ఆహారం, ఔషధాల కొరత అక్కడ నెలకొంది. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా ఉన్న తాము మరో గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు వాటినే తినిపిస్తున్నట్లు తెలిపారు. ‘మాలో’ అనే కలుపు మొక్కలను సేకరిస్తున్న వ్యాపారులు.. ఒక కట్ట మొక్కలకు 80 ఇజ్రాయెలీ షాకెల్స్‌(భారత కరెన్సీలో సుమారు రూ.1,800) వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఈ మొక్కను నోటి ఎలర్జీ, గొంతునొప్పి వంటి రుగ్మతలకు ఔషధంగా వాడుతారు. ఆహారంగా ఈ మొక్కను తీసుకోవడం ప్రమాదమని తెలిసినా.. ఆకలిని తట్టుకోవడానికి మరో మార్గం లేదని గాజా వాసులు వాపోతున్నారు గాజాలోని 23 లక్షల మంది జనాభాలో 80 శాతం మంది యుద్ధం కారణంగా తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది. ఈజిప్టుతో సరిహద్దు కలిగి ఉన్న రఫా నగరంలో ఏకంగా 14 లక్షల మంది తలదాచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన గుర్రాలను వండి పిల్లల కడుపు నింపాల్సి వస్తోందని శరణార్థులు వాపోతున్నారు. కాగా.. రంజాన్‌లోపు కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈజిప్ట్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం గాజా వాసుల ఆకలి కేకలకు కారణమవుతోంది. ఇజ్రాయెల్‌పై దాడిలో ఐక్య రాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చాక.. ఆ సంస్థ కూడా గాజా నుంచి పూర్తిగా వైదొలగింది. ఇంతకాలం శరణార్థులకు అన్నపానీయాలను అందించిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజాను వీడడంతో.. ఆకలి కేకలు పెరిగాయి.


Tags

Read MoreRead Less
Next Story