German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి

జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య జోసెఫా వాన్ హోహెన్‌జోలెర్న్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నమీబియా దేశ పర్యటనలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి హెరాల్డ్ ప్రాణాలు వదిలినట్లు పేర్కొంది. ‘‘ప్రియమైన లియోన్‌బర్గ్ పౌరులారా.. ఈరోజు బరువెక్కిన హృదయంతో రాస్తున్నాను. నా ప్రియమైన భర్త హెరాల్డ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తనను ఎంతగానో బాధించింది.’’ అంటూ భార్య జోసెఫా జర్మనీలో రాసింది. త్వరలో ఆయన భార్య జోసెఫా బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతలోనే భర్త చనిపోవడంతో బరువెక్కిన హృదయంతో విషాద వార్తను పంచుకుంది.
హెరాల్డ్‌ను జోసెఫా వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు యువరాణి బిరుదు వచ్చింది. ఈ జంట సెప్టెంబర్ 2024లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మొదటి బిడ్డ పుట్టనుంది. జూలై నెలలోనే జోసెఫా డెలివరీ కానుంది. కానీ ఇంతలోనే భర్త చనిపోయాడు. కన్న బిడ్డను చూడకుండానే కాలం చేశాడు. ఇక జోసెఫా ప్రస్తుతం జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్డ్ రాష్ట్రంలోని లియోన్‌బర్గ్ మేయర్‌గా తిరిగి ఎన్నికల బరిలోకి దిగింది. ‘‘నాకు దు:భించడానికి.. వీడ్కోలు చెప్పడానికి, పుట్టబోయే బిడ్డ కోసం సమయం కావాలి. అందుకే రాబోయే రాజుల్లో నేను ప్రచారం చేయలేను. సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్నాను. ఈ సమయంలో తనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని.. మీ సంతాపం, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.’’ ’’ అని జోసెఫా పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో భర్తతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
హెరాల్డ్-జోసెఫా 2022లో ఒక వాణిజ్య ప్రదర్శనలో కలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. జోసెఫాకు సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కనిపించారు. దీంతో ఆమెను ‘గాన మేయర్’ అని పిలుస్తారు. 2020లో బాడెన్-వుర్టెంబర్‌లోని లియోన్‌బర్గ్ ఆర్థిక మేయర్ పదవికి పోటీ చేశారు. 8 ఏళ్ల పదవీకాలానికి 33 ఓట్లలో 17 ఓట్లు సంపాదించి 2021, మేలో ఎన్నికయ్యారు.
హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్.. పూర్వపు రాజవంశానికి చెందిన వాడు. ఈ పూర్వీకుల రాజవంశం 1061 నాటిది. బ్రాండెన్‌బర్గ్, ప్రుస్సియా, రొమేనియా, జర్మన్ సామ్రాజ్యంతో సంబంధాలను కలిగి ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ విప్లవం సమయంలో రాజ గృహం కూలిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com