Ghana : చోరీ కంప్లైంట్ ఇచ్చి పదవి కోల్పోయిన మంత్రి
ఒక్కోసారి మనం చేసిన పని మనకే రివర్స్ అవుతుంది. జాగ్రత్తగా చేసిన దిక్కుమాలిన పని అనుకోకుండా బయటపడి పరువు పోయే సంఘటనలు మనకి తెలుసు. ఘనా దేశ పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తోన్న సెసిలియా అబీనా డఫా కి కూడా అదే జరిగింది. ఇంట్లో భారీ మొత్తంలో చోరీ జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
మంత్రి గారి ఇంటివిషయం కాబట్టి అందరూ ఆ విషయం పై చర్చించారు. ఒక మంత్రి ఇంట్లో అంత మొతం సొమ్ము ఎలా చేరిందంటూ కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దొంగ సొమ్ము దొంగల పాలైతే తప్పేంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు.
ఘనా ప్రభుత్వంలో పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సెసిలియా అబీనా డఫా ఇంటిలో భారీ దొంగతనం జరిగింది. సుమారు ఒక మిలియన్ డాలర్లు, 3 లక్షల యూరోలు, మరో 3 లక్షల 50 వేల ఘనా కరెన్సీ నగదు 35వేల డాలర్లు, 95 వేల డాలర్ల విలువ చేసే నగలు దోచుకుని వెళ్లారు దొంగలు. అంత పెద్ద మొత్తం చోరీ జరగడంతో మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
అయితే భారీ స్థాయి దొంగతనం కాబట్టి ఈ వార్త ఆ నోటా ఈ నోటా చేరి, మంత్రి ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉండటమేమిటని అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. పోయిన సొమ్ము గురించి కంప్లైంట్ ఇస్తే అదికాస్తా అక్రమ సంపాదన కేసుగా మారి తన మెడకే చుట్టుకోవడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు.
అవినీతి ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాధ్యతగా పదవి నుండి తప్పుకున్న డఫాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. యింట్లో పోయిన నగదు మొత్తం ఎంతన్నది స్పష్టంగా చెప్పకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని రాజీనామా లేఖలో రాశారు డాఫా. ఆమె అవినీతిపై స్పందించని ప్రభుత్వం రాజీనామాను ఆమోదిస్తూ, మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com